వ్యవసాయ కార్మికుల మహాసభల సందడి | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ కార్మికుల మహాసభల సందడి

Jun 19 2026 12:48 AM | Updated on Jun 19 2026 12:48 AM

పాలమూరులో 20 నుంచి రాష్ట్ర మహాసభలు

రాష్ట్ర నలుమూలల నుంచి 700 మంది ప్రతినిధులు

రేపు బహిరంగ సభ.. హాజరుకానున్న త్రిపుర మాజీ సీఎం మాణిక్‌ సర్కార్‌

మహబూబ్‌నగర్‌ రూరల్‌: వ్యవసాయ కార్మికుల సమస్యలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు ఈ నెల 20 నుంచి 22 వరకు మహబూబ్‌నగర్‌ పట్టణంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు తెలిపారు. మహాసభకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రంతో పాటు దేశ నలుమూలల నుంచి సుమారు 700 మంది ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. మహాసభల్లో భాగంగా 20 న భారీ ప్రదర్శనతో పాటు బహిరంగ సభ ఉంటుందన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1934లో ఏర్పడ్డ తమ సంఘం వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అట్టడుగు వర్గాల సమస్యలపై నిరంతరం పోరాడుతోందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిధుల్లో కోతలు విధించడం ద్వారా పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. దేశంలో 60 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడుతున్నప్పటికీ, పేదల సమస్యల పరిష్కారంపై సరైన దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. మహాసభల్లో వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీల సమస్యలు, పేదల సంక్షేమ అంశాలపై మొత్తం 22 తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆహ్వాన సంఘం కోశాధికారి ఎ.రాములు, సీఐటీయూ రాష్ట్ర నాయకులు కిల్లె గోపాల్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకురాలు పద్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి కడియాల మోహన్‌, నాయకులు హన్మంతు, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement