జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాలో పిల్లల భద్రత, సంరక్షణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. గురువారం కలెక్టరేట్ వీసీ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మన సమాజంలో సుమారు 30 నుంచి 40 శాతం జనాభా పిల్లలేనని, అయితే రహదారులు, ఆస్పత్రులు, తాగునీరు వంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా పెద్దల అవసరాల చుట్టూనే తిరుగుతున్నాయని పేర్కొన్నారు. పిల్లల అవసరాలు, వారి భద్రత, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా న్యాయ సేవాధికారి ఇందిర మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యూనిసెఫ్ ప్రతినిధి ఫిలిప్ మాట్లాడుతూ బాలల సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు పిల్లల అభిప్రాయాలను తెలుసుకోవడం లక్ష్యంగా గతేడాది నవంబర్ 21న 1,268 మంది పిల్లలతో ప్రత్యేక సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ఈ సర్వేలో వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకొని పాలమూరును బాలల సంరక్షణ వ్యవస్థ అభివృద్ధిలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, డీఆర్‌ఓ నిర్మల తదితరులు పాల్గొన్నారు.
కాలేజీల్లో మరమ్మతు పూర్తిచేయాలి
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేపట్టి పురోగతిలో ఉన్న సివిల్, ఎలక్ట్రికల్ మరమ్మతు పనులను 20 రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, పీఆర్, విద్య, మౌలిక వసతుల ఇంజినీరింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మరమ్మత్తు పనుల పురోగతిపై ప్రతిరోజూ నివేదిక సమర్పించాలని, రాబోయే 15 రోజులపాటు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని కళాశాల ప్రిన్సిపాళ్లకు ఆదేశించారు. జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు విస్తృత ప్రచారం చేయాలన్నారు.
రాజకీయ పార్టీలు సహకరించాలి
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలతో సమన్వయం చేసుకుంటూ, ఓటర్ల జాబితా ప్రక్షాళణ విజయవంతం అయ్యేలా సహకరించాలన్నారు. బూత్‌స్థాయి అధికారులు, అసెంబ్లీ నియోజకవర్గస్థాయి అధికారులకు క్షేత్రస్థాయి సన్నాహక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.


