బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధిలోని గోదాంలలో నిల్వ చేసే పంట దిగుబడులు, ఇతర నిల్వల భద్రతకు సంబంధించి బీమా సంస్థలకు ప్రీమియం రూ.9 లక్షల చెల్లింపునకు బిల్లులు సమర్పించారు. అయితే నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. అలాగే బాదేపల్లి యార్డు విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.3 లక్షలు, పత్తి మార్కెట్ యార్డు విద్యుత్ బకాయి రూ.1.60 లక్షలపైనే ఉండగా.. ఇప్పటి వరకు చిల్లిగవ్వ విదిల్చలేదు. తూకాలు వేసే కాంటాలు, తేమ శాతాన్ని సరిచూసే యంత్రాల మరమ్మతు బకాయిల చెల్లింపులు చేయకపోవడంతో అవి మూలకుపడ్డాయి. అలాగే జడ్చర్ల పత్తి మార్కెట్ యార్డులో పౌరసరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చిన గోదాంలో అగ్నిప్రమాదం జరగగా మంటలు ఆర్పేందుకు గోదాం గోడలను కూల్చారు. ఆ తర్వాత వీటికి మరమ్మతు చేయడానికి కూడా నిధులు లేకపోవడంతో అలాగే వదిలేశారు. దీంతో ప్రతినెలా వచ్చే అద్దెను సైతం కోల్పోవాల్సి వస్తుంది.


