జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో చేపట్టనున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎలాంటి లోపాలు, వివాదాలకు తావులేకుండా పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బూత్‌లెవల్ సూపర్‌వైజర్లు, అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్లు, అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు తప్పులు లేని స్పష్టమైన ఓటర్ల జాబితా అత్యంత కీలకమన్నారు. నకిలీ ఓటర్లు, మరణించిన వ్యక్తుల పేర్లను తొలగించి ఓటర్ల జాబితాను తప్పులు లేకుండా సవరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. సర్ ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఓటర్ల ధ్రువీకరణ, మ్యాపింగ్ ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఓటర్ల జాబితాలో తప్పు నమోదులు, అనవసర తొలగింపులు జరగకుండా జాగ్రత్త పడాలన్నారు. బూత్ లెవల్ అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయికి వెళ్లి ఓటర్లతో ప్రత్యక్షంగా మాట్లాడి వివరాలను ధ్రువీకరించిన తర్వాతే జాబితాలో మార్పు లు చేయాలని ఆదేశించారు. జిల్లాస్థాయిలో ఈఆర్‌లు, నియోజకవర్గస్థాయిలో ఏఈఆర్‌ఓలు సమర్థవంతంగా పనిచేయాలని, ఇపిక్ డిప్యూటీ తహసీల్దార్లు కూడా అత్యంత బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు తమ గుర్తింపు పత్రాలను సమర్పించి ధ్రువీకరణ ప్రక్రియలో సహకరించాలని కోరారు. పూర్తిస్థాయి పరిశీలన అనంతరం మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు మారిన వారు, ద్వంద్వ నమోదులు కలిగిన వారి పేర్లను తొలగించి, కొత్తగా అర్హత సాధించిన ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చనున్నట్లు వివరించారు. అదనపు కలెక్టర్లు మధుసూదన్‌నాయక్, జేఎల్‌బీ హరిప్రియ, జిల్లాస్థాయి మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు


