రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు
● నేలలో దాగున్న పోషకాలను
వెలికితీసే భాస్వర జీవన ఎరువులు
● భూసారం సంరక్షణ కోసం
30 వరకు ఖేత్ బచావో
మదనాపురం: నేటి ఆధునిక వ్యవసాయంలో కొందరు రైతులు రసాయన ఎరువులు లేకుండా పంటల సాగును ఊహించలేకపోతున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు ఇలా పంట ఏదైనా సరే డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల రూపంలో భాస్వరాన్ని గుట్టలు గుట్టలుగా పొలాల్లో పోస్తున్నారు. అయిలే పొలాల్లో చల్లే భాస్వర ఎరువుల్లో కొంత భాగాన్ని మాత్రమే మొక్కలు తీసుకోగలవు. మిగిలినదంతా నేలలోని రసాయనిక చర్యలతో కరగని రూపంలో స్థిరపడిపోతుంది. ఇలా ప్రతి సీజన్‌లో ఎరువులు వేస్తూ పోవడంతో నేలలో భాస్వరం నిల్వలు పెరిగిపోవడమే కాకుండా.. జింక్ వంటి రసాయనిక సూక్ష్మ పోషకాలు మొక్కలకు అందకుండా పోతున్నాయి. ఫలితంగా పెట్టుబడి దండగ అవ్వడమే కాకుండా, భూమి పోషకాల అసమతుల్యతకు గురవుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు తప్పనిసరిగా పాటించాలని మదనాపురం కేవీకే శాస్త్రవేత్త డా.భవాని సూచిస్తున్నారు. భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా: భూమిలో కరగని రూపంలో గడ్డకట్టుకుపోయిన భాస్వరాన్ని కరిగించి వేర్లకు అందేలా చేయడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. బాసిల్లస్ సూడోమోనాస్ ఆస్పర్‌జిల్లస్ పెనిసల్లియం వంటి బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు ఇందులో ఉంటాయి. హెక్టార్‌కు సుమారు 25 కిల్లోల భాస్వరాన్ని ఇవి మొక్కలకు అందిస్తాయి. మొక్కల పెరుగుదలకు కావాల్సిన హర్మోన్లు విడుదల చేస్తాయి. వీటిని వాడటం వల్ల రసాయన భాస్వర ఎరువుల వాడకాన్ని 20 నుంచి 25 శాతం వరకు తగ్గించుకోవచ్చు.
● ఎకరానికి 200 కిలోల సేంద్రియ ఎరువు లేదా బాగా కుళ్లిన పశువుల ఎరువులో 1 లీటర్ పీఎస్‌బీ కల్చర్‌ను కలిపి తేమ ఉండేలా చూస్తూ 15 రోజులు నీడలో ఉంచాలి. ఆ తర్వాత దుక్కిలో చల్లుకోవాలి. బెల్లం ద్రావణంలో 10 మి.లీ. పీఎస్‌బీ కలిపి విత్తనాలకు పట్టించి, నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. ఒక లీటర్ నీటిలో 10 మి.లీ. పీఎస్‌బీ కలిపి నారు వేర్లను 15–20 నిమిషాలు ముంచి ఆ తర్వాత నాటుకోవాలి.
భాస్వరాన్ని గ్రహించే శిలీంధ్రం (మైకోరైజా): ఇది మొక్కల వేర్లతో కలిసి జీవించే ఒక మైత్రి శిలీంధ్రం. వేర్ల చుట్టూ విస్తృతంగా వ్యాపించి, అందనంత దూరంలో ఉన్న భాస్వరాన్ని లాగి మొక్కకు అందిస్తుంది. భాస్వరంతో పాటు జింక్, బోరాన్, ఇనుము వంటి సూక్ష్మ పోషకాలను, నీటిని కూడా గ్రహిస్తుంది. ఇది మొక్కకు వాతావరణ ఒడిదుడుకులు, కరువును తట్టుకునే శక్తిని ఇస్తుంది. అన్ని రకాల పంటలు, నేలలకు ఇది అనుకూలం.
క్షేత్రస్థాయిలో ప్రచారం..
సమతుల్య ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1 నుంచి 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఖేత్ బచావో (వ్యవసాయ క్షేత్ర రక్షణ) కార్యక్రమం నిర్వహిస్తోంది. కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో భూసార పరీక్షలు నిర్వహించి.. జీవన ఎరువుల ప్రాధాన్యతపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
పాడి–పంట
ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన సంస్థల ద్వారా లభించే నాణ్యమైన జీవన ఎరువులను మాత్రమే కొనుగోలు చేయాలి.
జీవన ఎరువులను నేరుగా రసాయన, శిలీంధ్రనాశకాలు లేదా పురుగుమందులతో అస్సలు కలపకూడదు.
విత్తనశుద్ధి చేసిన విత్తనాలను ఎండలో కాకుండా కచ్చితంగా నీడలోనే ఆరబెట్టాలి. అలాగే వీలైనంత త్వరగా విత్తుకోవాలి.
జీవన ఎరువులు వేసేటప్పుడు, వేసిన తర్వాత నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి.


