● గద్వాలలో నదిఅగ్రహారం వెళ్లే మార్గంలో వెలసిన రెండు ప్రైవేటు పాఠశాలలు రూ.35 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. అలాగే యూనిఫాంలు, పుస్తకాలు, ఇతరత్రా వారి పేరిట మరో రూ.15–20 వేల వరకు అదనంగా లాగుతున్నారు.
● నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలో ని పోలీస్‌స్టేషన్ వెనకాల ఏర్పాటు చేసిన ఓ ప్రైవేటు పాఠశాల 6, 7 తరగతులకు అడ్మిషన్ ఫీజు, ఐఐటీ, నీట్, మెటీరియల్, యూనిఫాం ఇతరత్రా వాటి పేరుతో రూ.40–70 వేల వరకు వసూలు చేస్తున్నారు.
● పాలమూరు నగరంలోని తెలంగాణ చౌరస్తా సమీపంలో ఉన్న ఓ పాఠశాలలో కేవలం ఎల్‌కేజీ, యూకేజీ, 1వ తరగతి విద్యార్థులకు రూ.35– 50 వేల వరకు వసూలు చేస్తున్నారు. వీటితో పాటు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, అక్కడే కొనాలి. దీంతో ఒక్కొక్కరిపై కనీసం రూ.8 వేల వరకు అదనపు భారం పడుతుంది.
● నగరంలోని క్రిష్టియన్‌పల్లి సమీపంలో ఇటీవల ఏర్పాటు చేసిన పాఠశాలలో 5, 6, 7 తరగతుల ఫీజులు రూ.45–65 వేల వరకు వసూలు చేస్తున్నారు. సదరు పాఠశాలకు పూర్తిస్థాయిలో అనుమతులు లేకపోయినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
● ఏనుగొండ సమీపంలో ఇటీవల ప్రారంభించిన ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జిల్లాలోనే అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న చర్చ జరుగుతుంది. 6, 7 తరగతి విద్యార్థులకే రూ.70–95 వేల వరకు వసూలు చేస్తున్నారని పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీటికి తోడు యూనిఫాం, పుస్తకాలు అదనం. మయూరి పార్కు వద్ద ఇటీవల ప్రారంభించిన పాఠశాలలో ఒకటో తరగతి విద్యార్థికి రూ.50– 70 వేలు వసూలు చేస్తున్నారు. ఇప్పటికి దీనికి ఎలాంటి అనుమతులు లేకపోవడం గమనార్హం.
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: సామాజికసేవతో నిర్వహించాల్సిన ప్రైవేటు పాఠశాలలు కొందరు వ్యాపారంగా మార్చడంతో పేద విద్యార్థుల తల్లిదండ్రులకు గుదిబండగా మారింది. ఉమ్మడి జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేటు పాఠశాలల్లో.. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నా.. విద్యాశాఖ అధికారులు నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో పెద్దఎత్తున ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు ప్రారంభం కావడంతో తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ఫీజులు, ఇతర ఖర్చులు అమాంతం పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఒకపక్క ఫీజుల నియంత్రణ చట్టం తీసుకువస్తుందన్న చర్చ జరుగుతుంది. మరోవైపు అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఐఐటీ, నీట్‌కు అదనం..
పాఠశాల స్థాయిలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాల లోని అంశాలు కాకుండా సంబంధం లేని ఐఐటీ, నీట్ బోధిస్తామని.. రూ.10–20 వేల వరకు వసూ లు చేస్తున్నారు. ఇందులో స్టడీ మెటీరియల్‌కు అదనపు ఫీజులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఐఐ టీ, నీట్ బోధించేందుకు వారంలో రెండు, మూడు రోజులు ఉదయం, లేదా సాయంత్రం వేళల్లో అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పీఈటీ తరగతులను ఎత్తివేసి వాటికి సమయం కేటాయిస్తున్నారు. దీంతో విద్యార్థులు శారీరకంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.
కొన్ని ప్రైవేట్ స్కూల్స్‌లో దోపిడీ ఇలా..
నారాయణపేట కలెక్టరేట్‌కు దగ్గరలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో హైస్కూల్ విద్యార్థులకు రూ.45వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనికి బస్సు ఫీజు అదనం. తల్లిదండ్రులు ఎవరైనా తెలిసిన వారితో రికమండ్ చేస్తే.. ఫీజులు తగ్గిస్తాం కానీ మీ పిల్లలు చదువులో వెనకబడితే మాకు తెలవదంటూ ఆ పాఠశాల ప్రిన్సిపల్ చెబుతున్నాడు.
ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఇష్టానుసారంగా ఫీజుల వసూళ్లు
ఎల్‌కేజీ, యూకేజీ, 1వ తరగతి రూ.35– 50 వేల వరకు..
స్కూల్‌స్థాయిలో ఐఐటీ, నీట్ ఫౌండేషన్ కోర్సుల పేరిట అదనం
టై, బెల్టు, పుస్తకాలు, యూనిఫాం, షూ పేరుతో నిలువుదోపిడీ
పాఠశాలల్లోనే విక్రయిస్తున్నా పట్టింపులేని విద్యాధికారులు


