20న జాతీయ లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

20న జాతీయ లోక్‌ అదాలత్‌

Jun 7 2026 8:54 AM | Updated on Jun 7 2026 8:54 AM

పాలమూరు: జిల్లాలో ఉన్న కోర్టులలో ఈనెల 20న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.ప్రేమలత వెల్లడించారు. జిల్లా కోర్టులో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌లో కేసు దాఖలు చేసినప్పుడు రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. పెండింగ్‌లో ఉన్న సివిల్‌ కేసును లోక్‌ అదాలత్‌కు పంపిన తర్వాత అక్కడ కేసు పరిష్కరిస్తే కోర్టులో చెల్లించిన ఫీజు సైతం తిరిగి ఆయా పార్టీలకు ఇచ్చేస్తామన్నారు. లోక్‌ అదాలత్‌ వల్ల ఇరువర్గాలకు తక్షణ పరిష్కారం లభిస్తుందని, దీని వల్ల సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుందన్నారు. జిల్లాలో ఈనెల 20న నిర్వహించనున్న లోక్‌ అదాలత్‌ కోసం 9 బెంచీలు ఏర్పాటు చేసి కేసులు రాజీ చేయడం జరుగుతుందని ఇప్పటికే 1,689 కేసులు గుర్తించి సంబంధిత కక్షిదారులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. పోలీస్‌శాఖ అధికారులతో పాటు అన్ని రకాల బ్యాంకు అధికారులు, ఇన్సూరెన్స్‌ సంస్థలు వారి పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులు గుర్తించి లోక్‌ అదాలత్‌కు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తి ఇందిర పాల్గొన్నారు.

చల్లబడిన వాతావరణం

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: జిల్లావ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం 15 నిమిషాల పాటు ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉదయం నుంచి ఎండ వేడిమికి తల్లడిల్లిన ప్రజలు ఈ వర్షం కారణంగా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఉమ్మడి జిల్లాలోని నవాబుపేట మండలంలో 24 మి.మీ., నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలంలో 18 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఆరుగురు ఆర్టీసీ డిపో మేనేజర్ల బదిలీ

నారాయణపేట రూరల్‌: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆరుగురు ఆర్టీసీ డిపో మేనేజర్లను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణపేట డీఎం టి.లావణ్య హైదరా బాద్‌లోని హయత్‌నగర్‌ డిపో–1కు బదిలీ కాగా.. ఆమెస్థానంలో హెడ్‌ఆఫీస్‌లోని ఏటీఎం కార్గో ఇన్‌చార్జి డీఎన్‌ రాజన్‌ను కేటాయించారు. షాద్‌నగర్‌ డీఎం ఉషను జనగాంకు బదిలీ చేయగా.. ఆమెస్థానంలో హైదరాబాద్‌ డిపో–2 నుంచి కరుణశ్రీ రానున్నారు. అచ్చంపేట డీఎం పీఎండీ ప్రసాద్‌ హయత్‌నగర్‌ డిపో–2కు బదిలీ కాగా.. ఆయన స్థానంలో డిప్యూటీ ఈ–ఎలక్ట్రికల్‌ హెచ్‌ఆర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ను కేటాయించారు. గద్వాల డీఎం సునీతను కూకట్‌పల్లి డిపోకు బదిలీ చేయగా.. ఆమె స్థానంలో రాణిగంజ్‌ డిపో నుంచి శ్రీధర్‌ వస్తున్నారు. కొల్లాపూర్‌ డిపో మేనేజర్‌ ఉమాశంకర్‌గౌడ్‌ను ఐటీ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేయగా.. ఆయన స్థానంలో వరంగల్‌ బస్టాండ్‌ ఏటీఎం మల్లేశ్వరయ్యను కేటాయించారు. కల్వకుర్తి డీఎం సుహాసినిని ఇల్లందు డిపోకు కేటాయించగా.. ఆమె స్థానంలో ఎవరినీ నియమించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement