జడ్చర్ల: ఆర్టీసీ బస్సుల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికులే లక్ష్యంగా చేసుకుని వారిని వెంటాడి వారి బ్యాగుల్లోని బంగారు ఆభరణాలను అపహరించే అంతరాష్ట్ర దొంగల ముఠాను ఎట్టకేలకు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు వివరాలు వెళ్లడించారు. ఆయన కథనం మేరకు.. జడ్చర్లలో ఈనెల7న నేతాజీ చౌరస్తాలో పండ్లు కొంటున్న ఓ మహిళా ప్రయాణికురాలిని ఈ ముఠా ఎంపిక చేసుకుని ఆమె ఆర్టీసీ బస్సు ఎక్కిన వెంటనే ముఠా సభ్యులు కూడా ఆమె వెంటే బస్సు ఎక్కి చుట్టుముట్టు చేరి ఆమె దృష్టిని మరల్చి ఆమె బ్యాగులో ఉన్న బంగారు ఆభరణాలు అపహరించారు. అదేవిధంగా ఈనెల 18న జడ్చర్ల బస్టాండ్ వద్ద ఆటోలో వచ్చిన ప్రయాణికులను అనుసరించి వారు ఎక్కిన బస్సు ఎక్కిన ముఠా మహిళ బ్యాగులోని బంగారాన్ని అపహరించారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలా ఆర్టీసీ ప్రయాణికులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను మంగళవారం ఎట్టకేలకు పట్టుకున్నారు. జడ్చర్ల కొత్త బస్టాండ్ వద్ద తనిఖీలు చేస్తుండగా.. అనుమానాస్పదంగా వచ్చిన కారులో ఉన్న దొంగలను పట్టుకుని విచారించగా.. దొంగతనాలు బయటకు వచ్చాయి. హర్యాన రాష్ట్రానికి చెందిన సందీప్, అశోక్, ప్రవీణ్, రాజేశ్, సునీల్‌కుమార్, సచిన్ ఓ ముఠాగా ఏర్పడి చోరీలు చేసేవారు. ముఠా నాయకుడిగా ఉన్న సందీప్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ ఇతర రాష్ట్రాలు తిరిగే క్రమంలో చోరీలకు అలవాటు పడ్డాడు. 2017–2019 మధ్యకాలంలో హైదరాబాద్, అదిలాబాద్, విశాఖపట్టణంలో జరిగిన 15 చోరీల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అయితే ఒంటరిగా కాకుండా ఓ ముఠాగా ఏర్పడితే పెద్ద మొత్తంలో దోచుకోవచ్చన్న ప్రణాళికతో తన అనుభవాన్ని ఉపయోగించి హర్యానలోని తన బంధువులు, పరిచయస్థులను కలుపుకొని ఓ ముఠాను తయారు చేసి నాయకత్వం వహించాడు. వీరంతా కలిసి తమ బంధువైన దీపక్‌ను సంప్రదించి తాము విహారయాత్రకు వెళ్తున్నామని నమ్మబలికి కియా కారెన్స్ వాహనాన్ని తీసుకుని ఈనెల మొదటి వారంలో స్వరాష్ట్రం నుంచి తెలంగాణకు బయలుదేరి వచ్చారు.
10తులాల బంగారు నగలు స్వాధీనం
నిందితుల నుంచి 10తులాల బంగారు నగలను స్వాధీనం చేసకున్నారు. నక్లెస్‌లు రెండు, 7జతల కమ్మలు, ముక్కు పుడక, మూడు లాకెట్లు, 6 పట్టీలు, మూడు ఉంగరాలు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా దొంగతనాలకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠాను సమర్థవంతంగా పట్టుకున్న సీఐ కమలాకర్, ఎస్‌ఐ మల్లేష్, సిబ్బంది విష్ణుమూర్తి, నర్సింహ, రాజును డీఎస్పీ అభినందించారు.
దృష్టిని మరల్చి ఆభరణాల అపహరణ
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
10తులాల బంగారు నగలు, కారు స్వాధీనం
వివరాలు వెల్లడించిన డీఎస్పీ వెంకటేశ్వర్లు


