నీటి హౌజ్‌లో పడి చిన్నారి మృతి | - | Sakshi
Sakshi News home page

నీటి హౌజ్‌లో పడి చిన్నారి మృతి

May 20 2026 11:25 AM | Updated on May 20 2026 11:25 AM

వీపనగండ్ల: ప్రమాదవశాత్తు ఇంటి ముందు ఉన్న నీటి హౌజ్‌లో పడి ఓ చిన్నారి మృతిచెందింది. మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన మల్లేశ్వరి, లింగస్వామి దంపతుల నాలుగో కూతురు లాస్యశ్రీ(3) మంగళవారం తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ బాత్రూంలోకి వెళ్లి నీటి హౌస్‌లో పడి మృతిచెందింది. ఈ ఘటనతో చిన్నారి తల్లిదండ్రులు బోరున విలపించారు.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు

చికిత్స పొందుతూ మహిళ దుర్మరణం

వెల్దండ: వేగంగా వచ్చిన ఓ కారు రోడ్డుపై ఆపి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఓ మహిళ దుర్మరణం పాలైంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వంగూరు మండలం సర్వారెడ్డిపల్లి గ్రామానికి చెందిన జాజల జనార్దన్‌ భార్య జయమ్మ(34), కూతురు దాళికతో కలిసి హైదరాబాద్‌లో మేసీ్త్ర పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కోనేటిపూర్‌లో సోమవారం బంధువుల ఇంట్లో ఫంక్షన్‌ ఉండటంతో హైదరాబాద్‌ నుంచి స్నేహితుడి కారును తీసుకొని జనార్దన్‌, జయమ్మ, చిన్న కుమార్తె దాళికతో కలిసి వచ్చారు. ఫంక్షన్‌ అనంతరం అర్ధరాత్రి తిరిగి కారులో హైదరాబాద్‌ వెళ్తుండగా మార్గమధ్యలో వెల్దండ మండలం కొట్ర రెవెన్యూ శివారులోని హైదరాబాద్‌– శ్రీశైలం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జయమ్మ తల, మెడపై తీవ్రగాయాలవగా.. జనార్దన్‌, దాళిక స్వల్పగాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను వెల్దండలోని యెన్నమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ జయమ్మ మృతిచెందింది. మంగళవారం జయమ్మ మృతదేహానికి కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ యుగంధర్‌రెడ్డి తెలిపారు.

ట్రాక్టర్‌ ఢీకొని చిన్నారి మృతి

రాజాపూర్‌: పొలంలో ట్రాక్టర్‌ను రివర్స్‌ తీస్తుండగా వెనకాలే ఉన్న చిన్నారి మృతిచెందిన సంఘటన మంగళవారం బాలానగర్‌ మండలం చిన్నరేవల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దరేవల్లి గ్రామానికి చెందిన రత్నమేరి, భాస్కర్‌రెడ్డి దంపతులు తమ కూతురు ఆకాంక్ష(10)తో కలిసి మంగళవారం ఉదయం తమ పొలంలో మక్క కంకులను కూలీలతో ట్రాక్టర్‌లో లోడ్‌ చేస్తున్నారు. అనంతరం ట్రాక్టర్‌ను భాస్కర్‌రెడ్డి బావ ఆనంద్‌రెడ్డి అజాగ్రత్తగా రివర్స్‌ తీయగా వెనకాలే ఉన్న ఆకాంక్ష తీవ్రగాయాలపాలైంది. వెంటనే బాలికను షాద్‌నగర్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ట్రాక్టర్‌ను అజాగ్రత్తగా నడిపి తన కూతురు మృతికి కారణమైన ఆనంద్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తల్లి రత్నమేరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement