రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా

May 20 2026 11:25 AM | Updated on May 20 2026 11:25 AM

అలంపూర్‌: రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ద్వారా ప్రత్యేక నిఘా ఉందని జిల్లా పశు వైద్య, పశు సంవర్థక శాఖ అధికారి శివానంద స్వామి తెలిపారు. అలంపూర్‌ చౌరస్తా సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఉన్న పుల్లూరు టోల్‌ప్లాజా చెక్‌పోస్టును జిల్లా పశువైద్య, సంవర్ధక శాఖ అధికారి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు సలహాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అంతర్రాష్ట్రాల సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 7చెక్‌ పోస్టుల ద్వారా నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ–ఏపీ సరిహద్దులుగా ఉన్న పుల్లూరు, భైరాపురం స్టేజీ, రాజోలి వద్ద సుంకేసుల డ్యాం, జాతీయ రహదారిపై ఎర్రవల్లి చౌరస్తా వద్ద చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ–కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న బల్గెర, నందిన్నె, కేటిదొడ్డి మండలంలోని ఇర్కిచేడు వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చెక్‌పోస్టుల వద్ద పోలీసులతోపాటు పశు సంవర్ధక శాఖ సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 24 గంటలపాటు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా బక్రీద్‌ పండుగా దృష్ట్యా గోజాతి అవులు, గోజాతీ పశువులు, కోడెదూడలు, ఎద్దులు తరలి వెళ్లకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పాల ఉత్పత్తి, వ్యవసాయం కోసం వినియోగించే గోజాతి పశువులు, ఏడాదిలోపు దూడలను వధించరాదన్నారు. అలాంటి పశువులను వధిస్తే చట్టపరంగా క్రూరత్వం కింది కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. వీరితోపాటు పశువైద్య అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

పశు సంవర్ధకశాఖ జిల్లా అధికారి శివానందస్వామి

Advertisement
 
Advertisement
Advertisement