మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మూడేళ్లుగా నగర పరిధిలోని చికెన్ షాపుల నుంచి వేస్టేజీ సేకరించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏటా వేలం పాటలు నిర్వహిస్తున్నారు. ఇందులో అధిక రేటుకు దక్కించుకున్న కాంట్రాక్టర్.. ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్‌కు సరిగా డబ్బులు చెల్లించకపోవడం రివాజుగా మారింది.
మున్సిపాలిటీగా ఉన్నప్పుడు 13 ఏళ్ల క్రితం మహబూబ్‌నగర్‌లో వేళ్లమీద కొన్ని చికెన్ షాపులు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత పట్టణం విస్తరిస్తున్న కొద్దీ వినియోగదారుల డిమాండ్ మేరకు ఈ షాపులు పెరుగుతూ వచ్చాయి. అప్పట్లో (2012–13) బాయమ్మతోటలోని వరద కాల్వలో తరచూ ఆయా షాపుల యజమానులు చికెన్ వ్యర్థాలను వేస్తున్నారని, ఎక్కడికక్కడ దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన వారు ప్రతి చికెన్ షాపు నుంచి నెలకు రూ.300 చొప్పున ఫీజు వసూలు చేసి ఈ వ్యర్థాలను తీసుకుని డంపింగ్ యార్డుకు తరలించసాగారు. ఇక 2021 వచ్చేసరికి ఈ షాపులు సుమారు 80 వరకు పెరిగాయి. ఈ క్రమంలోనే నామినేషన్ పద్ధతిన ఒప్పందం చేసుకున్న వ్యర్థాలు సేకరించి.. మున్సిపాలిటీకి పన్ను చెల్లించారు. ఇక 2024–25 నుంచి ఏటా మున్సిపల్ అధికారులు వేలం పాటలు నిర్వహిస్తూ వస్తున్నారు. మొదటిసారి 2024 జూన్ 20న జరిగిన వేలం పాటలో రూ.15.30 లక్షలకు దక్కించుకున్న గయాసొద్దీన్ కేవలం రూ.3.20 లక్షలు మాత్రమే చెల్లించి చేతులెత్తేశారు. అదే ఏడాది డిసెంబరులో మరోసారి వేలం పాటలు నిర్వహించగా విజయకుమార్ అనే వ్యక్తి రూ.14.20 లక్షలకు దక్కించుకున్నా ఏ మాత్రం చెల్లించలేకపోయారు. దీంతో అప్పటి అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ గతేడాది మార్చిలో చికెన్ షాపు యజమానులతో మూడుసార్లు సమావేశం నిర్వహించినా ఓ కొలిక్కి రాలేదు. 2025–26లో మరోసారి వేలం నిర్వహించగా.. రూ.65.70 లక్షలకు పరుశురామ్ అనే వ్యక్తి టెండర్ దక్కించుకున్నారు. అయితే ఈ వేలం పాటల నిర్వ హణ సరిగా లేదంటూ గత జూన్ 11న ఇనాయత్ అలీ హైకోర్టుకు వెళ్లడంతో స్టే విధించింది. దీంతో ఎవరూ నయాపైసా కూడా మున్సిపల్ అధికారులకు చెల్లించలేదు. తాజాగా 2026–27కు ఈనెల 5న నిర్వహించిన వేలం పాటలలో ఇనాయత్ అలీ రూ.25.40 లక్షలకు దక్కించుకున్నారు. నిబంధనల మేరకు మొదటి విడతగా ఈపాటికే (50 శాతం) రూ.12.71 లక్షలకు డీడీ చెల్లించారు. మిగతా డబ్బులు గడువు లోగా మరో రెండు విడతలుగా కట్టేందుకు అంగీకారం కుదుర్చుకున్నారు.
సహకరించని దుకాణ యజమానులు
ప్రస్తుతం నగరంలో సుమారు 120 చికెన్ షాపులు ఉంటాయి. వీటి నుంచి నిత్యం కనిష్టంగా 4 మెట్రిక్ టన్నులు, గరిష్టంగా 8 మెట్రిక్ టన్నుల వేస్టేజీ బయటకు వస్తుంది. ఇక ఏటా వేలం పాటలలో దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు వీటిని ఇవ్వకుండా వారే నేరుగా వివిధ ఫ్యాక్టరీలకు, చేపల చెరువులకు తరలిస్తున్నారు. ఈ వ్యవహారంలో మూడు, నాలుగు గ్రూపులు (రింగ్)గా ఏర్పడి రూ.లక్షల్లో లాభాలను ఆర్జిస్తున్నారు. దీనివల్ల సదరు వ్యక్తి తనకు తీవ్ర నష్టం వాటిల్లుతోందంటూ మున్సిపల్ కార్పొరేషన్‌కు డబ్బులు సరిగా చెల్లించకుండా చివరకు చేతులెత్తేస్తున్నారు. ఐదేళ్లుగా ఇదే తంతు కొనసాగుతుంది. కాగా, నిబంధనల ప్రకారం ప్రతి చికెన్ షాపు యజమాని తప్పకుండా సదరు వ్యక్తికి మాత్రమే వేస్టేజీ ఇవ్వాలంటూ తాజాగా నోటీసులు అందజేస్తుండడం గమనార్హం.
కాంట్రాక్టర్‌కే ఇవ్వాలి..
నిబంధనల ప్రకారం కాంట్రాక్టు దక్కించుకున్న వ్యక్తికి మాత్రమే చికెన్ వేస్టేజీని నగరంలోని దుకాణ యజమానులు తప్పనిసరిగా ఇవ్వాలి. ఒకవేళ ఎవరైనా అతనికి కాదని నేరు గా ఫ్యాక్టరీలకు లేదా చేపల చెరువులకు తరలిస్తే తగు చర్యలు తీసుకుంటాం. అవసరమైతే దుకాణం లైసెన్స్ రద్దు చేస్తాం. ఈ విష యమై సహకరించని చికెన్ షాపులకు నోటీసులు అందజేస్తున్నాం. – పి.రామాంజులరెడ్డి,
కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్
మొదట్లో నెలకు రూ.300 చొప్పునచికెన్ షాపుల నుంచి వసూలు
మూడేళ్ల నుంచే చికెన్ వేస్టేజీ
సేకరణకు వేలం పాటలు
దక్కించుకున్న వారు
కార్పొరేషన్‌కు సరిగా చెల్లించని వైనం
హైకోర్టు స్టేతో 2025–26లో జీరో రాబడి


