మహబూబ్‌నగర్ (వ్యవసాయం): యాసంగి సీజన్ పూర్తి కావొచ్చినా.. ఇప్పటికీ పూర్తిస్థాయిలో రైతు భరోసా అందలేదు. రెండెకరాలలోపు రైతులకే పెట్టుబడి సాయం పరిమితం కాగా.. మిగిలిన రైతుల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ చేస్తారన్న విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. దీంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైతులకు పంటల పెట్టుబడి విషయంలో అండగా నిలవాలనే ఉద్దేశంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018లో రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చింది. మొదట్లో ఎకరానికి ఏటా రూ.8 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించిన సర్కారు.. తర్వాత దీనిని రూ.10 వేలకు పెంచింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సీజన్‌కు ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేస్తామని పేర్కొంది. గత ఖరీఫ్‌లో రైతులందరికీ నిధులు జమ కాగా.. యాసంగికి వచ్చేసరికి పథకం అమలులో జాప్యం జరుగుతుంది.
ఇచ్చింది రూ.166.68 కోట్లే..
జిల్లాలో 2,31,589 మంది రైతులు ఉన్నారు. అందరికీ పెట్టుబడి సాయం అందించడానికి రూ.251.19 కోట్ల నిధులు అవసరం. సాధారణంగా యాసంగికి సంబంధించిన రైతు భరోసా నిధులను డిసెంబర్, జనవరి నెలల్లో విడుదల చేస్తారు. కానీ, ఈసారి మార్చి 22న మొదటి విడత నిధులు విడుదల చేసింది. అది కూడా ఎకరం వరకు పెట్టుబడి సాయాన్ని అందరు రైతుల ఖాతాలలో జమ చేశారు. గత నెల 20న రెండో విడతలో రెండెకరాలలోపు రైతులకు సాయం అందించారు. రెండు విడతల్లో కలిపి జిల్లాలోని 2,23,248 రైతులకు రూ.166.68 కోట్లు జమ కాగా.. ఇంకా 8,341 మంది రైతులకు రూ.84.51 కోట్లు అందించాల్సి ఉంది. మిగతా నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అన్న విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు.
ఆర్థిక ఇబ్బందుల్లో రైతాంగం..
గతంలో పంట పెట్టుబడుల కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చేది. రైతుబంధు పథకం వచ్చాక రైతులకు అప్పులు చేయాల్సిన అవసరం కొంత తగ్గింది. అయితే ఈ పథకాన్ని అమలు చేయడంలో రెండేళ్లుగా జాప్యం జరుగుతుండటంతో మళ్లీ అన్నదాతలు అప్పులు చేయాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగి భరోసానే పూర్తిస్థాయిలో అందకపోవడంతో ఇక వచ్చే ఖరీఫ్ పెట్టుబడి సాయం ఉంటుందో.. ఉండదో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికై నా చిత్తశుద్ధితో వ్యవహరించి పూర్తిస్థాయిలో రైతు భరోసా నిధులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
అసంపూర్తిగా యాసంగి పెట్టుబడి సాయం
ఇప్పటి వరకు రెండు ఎకరాలకే అందిన డబ్బులు
మిగిలిన వాటి విడుదలలో ప్రభుత్వం కాలయాపన
నీరుగారుతున్న రైతు భరోసా లక్ష్యం
పంటల పెట్టుబడికి
ఇబ్బందుల్లో అన్నదాతలు


