జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): డిండి లిఫ్టునకు పాలమూరు– రంగారెడ్డి నుంచి కాకుండా నాగార్జునసాగర్ నుంచి నీళ్లు తీసుకోవాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్ట్‌ల సాధన జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి విరివిగా నిధులు విడుదల చేయాలని కోరారు. డిండి ఎత్తిపోతల పథకానికి ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీల నీటి తరలింపు ప్రతిపాదనను విరమించుకోవాలని సూచించారు. పార్టీలకతీతంగా ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు ప్రాజెక్టుల పూర్తికి కృషిచేయడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయి పర్యటన చేయాలని విన్నవించారు. అలాగే ఉమ్మడి జిల్లాలో అసంపూర్తిగా ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, జూరాల, భీమా, కోయిల్‌సాగర్, ఆర్డీఎస్ పనులను పూర్తి చేసి జిల్లా ప్రజలు, రైతాంగానికి సాగు, తాగునీళ్లు అందించాలన్నారు. గట్టు ఎత్తిపోతలు, వెల్టూరు– గొందిమల్ల బ్యారేజీ, కాకరవాణి, చంద్రసాగర్, అమ్రాబాద్ పనులు తక్షణమే చేపట్టాలని కోరారు. రాష్ట్ర వాటా నీరు పూర్థిస్థాయిలో వినియోగంలోకి వచ్చే వరకు గోదావరి– కావేరి అనుసంధానాన్ని వ్యతిరేకించాలని చెప్పారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాఘవచారి, బెక్కం జనార్దన్, చెన్నకిష్టన్న తదితరులు పాల్గొన్నారు.


