ధన్వాడ: మండలంలోని కొండాపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి నగదు విత్ డ్రా చేసి తీసుకెళ్తుండగా దొంగ చోరీకి పాల్పడ్డాడు. ఘటన ఈనెల 14 బుధవారం జరగగా తాజాగా కేసు నమోదు చేసినట్లు ఎస్ వెంకటేశ్ గౌడ్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. చికర్లగడ్డ తండాకు చెందిన నాన్యానాయక్ అనే వృద్ధుడు ధాన్యం అమ్మిన డబ్బులు తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు నుంచి రూ.లక్ష విత్‌డ్రా చేసి బయటికి రాగానే అక్కడే ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మీ కుటుంబం తెలుసు అంటూ మాటలు కలిపాడు. ఈ క్రమంలో జేబులో నుంచి సైలెంట్‌గా డబ్బులు కాజేసి ఫోన్ చేసుకోవాలని చెప్పి ఫోన్ తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. బాధితుడి కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
వరిగడ్డి ట్రాక్టర్‌ను
ఢీకొన్న లారీ
ఎర్రవల్లి: జాతీయ రహదారిపై వరిగడ్డి ట్రాక్టర్‌ను లారీ ఢీకొన్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఇటిక్యాల మండల పరిధిలోని సాతర్ల గ్రామానికి చెందిన రైతులు ట్రాక్టర్‌లో పెబ్బేరు మండంలోని రంగాపురం నుంచి వరిగడ్డిని సాతర్లకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై జింకలపల్లి సమీపంలో వెళ్తుండగా అదే దారి గుండా వెళ్తున్న ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రాక్టర్ అదుపుతప్పి ఒక్కసారిగా రోడ్డుపై బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు తేలికపాటి గాయాలతో బయటపడ్డారు.
రేషన్ బియ్యం పట్టివేత
ఖిల్లాఘనపురం: మండలంలోని అప్పారెడ్డిపల్లి క్రాస్ రోడ్డు దగ్గర సోమవారం సీసీఎస్ పోలీసులు రేషన్‌బియ్యంతో వెళ్తున్న ఆటోను పట్టుకున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు. మదనాపురం మండలం నుంచి సిలమర్తి కృష్ణ 25 బస్తాల్లో 8 క్వింటాళ్ళ బియ్యం తీసుకుని వెళ్తుందన్న పక్కా సమాచారంతో కాపలా కాసి పట్టుకున్నట్లు తెలిపారు. బియ్యంతో ఉన్న ఆటోను పోలీస్టేషన్‌కు తరలించడం జరిగిందన్నారు.


