గద్వాల: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతుపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. దో హబ్‌గా పిలువబడే కృష్ణా, తుంగభద్ర నదులు నడిగడ్డలో పారుతున్నప్పటికీ.. సాగునీటి ప్రాజెక్టుల పనులు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉండటంతో పంట పొలాలకు సాగునీరు పారడం గగనంగా మారుతోంది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు, ఆర్డీఎస్, గట్టు ఎత్తిపోతల పథకాల ద్వారా ఏటా రెండు పంటలకు సమృద్ధిగా సాగునీరు పారి కళకళలాడాల్సిన వ్యవసాయ భూములు కాస్త బీళ్లుగా మారుతున్నాయి. జిల్లావ్యాప్తంగా యాసంగిలో జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టు కింద కేవలం 49వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందిస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. తుగభద్ర నది పరిధిలోని రాజోళిబండ డైవర్షన్ పథకం కింద రెండేళ్లుగా యాసంగిలో పూర్తిగా పంటలకు క్రాప్‌హాలిడే ప్రకటించారు. అదే విధంగా కృష్ణానది పరిధిలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ఉన్న ర్యాలంపాడు జలాశయానికి పలుచోట్ల లీకేజీలు ఏర్పడటంతో ఆయకట్టుకు యాసంగిలో పూర్తిగా క్రాప్‌హాలిడే ఇస్తున్నారు. అదే విధంగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన గేట్ల ఇనుప రోపులు తెగిపోగా.. మరమ్మతు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మరమ్మతులను పూర్తిచేయడంలో పాలకులు, అధికారులు అవలంబిస్తున్న నిర్లక్ష్యంపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
వానాకాలంలోనే పూర్తిస్థాయిలో..
కృష్ణానది పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కింద 1,09,296 ఎకరాలు, నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 1,42,000 ఎకరాలు, తుంగభద్ర నది పరిధిలో ఆర్డీఎస్ కింద 83,998 ఎకరాలతో కలిపి మొత్తం 3,35,294 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఏటా వానాకాలంలో పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు పారుతోంది. యాసంగిలో మాత్రం కేవలం 49వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు పరిమితమవుతోంది. గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది.
ఇదీ పరిస్థితి..
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 62 క్రస్ట్ గేట్లు ఉండగా.. అందులో 12 గేట్లకు సంబంధించి ఇనుప రోపులు పూర్తిగా తెగిపోయాయి. దీంతో ఈ ఏడాది వరద సమయంలో ప్రాజెక్టు భద్రతపై పెద్దఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉన్నతాధికారులు జూరాల ప్రాజెక్టును సందర్శించి.. అంతా బాగుందంటూ ప్రకటనలు చేసి వెళ్లారు. ప్రస్తుతం ప్రాజెక్టు గేట్ల మరమ్మతు ఇంకా అసంపూర్తిగానే మిగిలింది. ఫలితంగా యాసంగిలో కేవలం 26వేల ఎకరాలకే సాగునీటిని అందిస్తున్నారు.
● నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ర్యాలంపాడు జలాశయం అడుగు భాగాల్లో, తూముల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. ఫలితంగా జలాశయం ఉనికికే ప్రమాదం పొంచి ఉంది. దీంతో 4 టీఎంసీల సామర్థ్యాన్ని కాస్త 2 టీఎంసీలకు కుదించి.. నాలుగేళ్లుగా ఏటా వానాకాలం పంటకే నీరందిస్తున్నారు.
● రాజోళిబండ డైవర్షన్ పథకం హెడ్‌వర్క్స్, గేట్లు, ప్రధాన కాల్వల మరమ్మతు 2007లో మొదలుపెట్టగా.. నేటికీ టీవీ సీరియల్ మాదిరిగా కొనసాగుతూనే ఉంది. ఫలితంగా ఆర్డీఎస్ కింద యాసంగిలో క్రాప్‌హాలిడే ప్రకటించడం ఆనవాయితీగా మారింది.
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు
నడిగడ్డ సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యపు నీడలు
వానాకాలం ముంచుకొస్తున్నా జూరాల గేట్లకు పూర్తికాని మరమ్మతు
యాసంగిలో 26 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు
ర్యాలంపాడు జలాశయం 2 టీఎంసీలకే పరిమితం
నత్తనడకన ఆర్డీఎస్ పనులు


