యువతకు రాష్ట్రస్థాయిలో వర్చువల్‌ సెషన్లు | - | Sakshi
Sakshi News home page

యువతకు రాష్ట్రస్థాయిలో వర్చువల్‌ సెషన్లు

May 19 2026 12:52 AM | Updated on May 19 2026 12:52 AM

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 18 నుంచి 23 వరకు క్రీడా, యువజన, పర్యాటక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ఖుష్బూగుప్తా తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఆమె చాంబర్‌లో టూరిజం వీక్‌, యూత్‌– స్పోర్ట్స్‌ వీక్‌ పోస్టర్లు, బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ద్వారా యువతలో శారీరక దృఢత్వం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతాభావం, యువశక్తి వికాసం, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించడమే లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఫిట్‌– యాక్టివ్‌ తెలంగాణ కార్యక్రమంతో వారోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. మంగళవారం కెరీర్‌– స్కిల్‌ డెవలప్‌మెంట్‌ డే సందర్భంగా నైపుణ్యాభివృద్ధి కోర్సులు, స్పోర్ట్స్‌ యూనివర్సిటీ అవకాశాలు, స్కిల్‌ యూనివర్సిటీ కార్యక్రమాలు, అగ్నివీర్‌ నియామకాలపై యువతకు రాష్ట్ర, జిల్లాస్థాయిలో వర్చువల్‌ సెషన్లు నిర్వహించి అవగాహన కల్పిస్తారన్నారు. బుధవారం యూత్‌ లీడర్‌షిప్‌ సమ్మిత్‌, గురువారం ప్లే– పార్టిసిపేట్‌– స్పోర్ట్స్‌ డే, శుక్రవారం సర్వ్‌– సపోర్ట్‌– క్లీన్‌ తెలంగాణ స్వచ్ఛ క్రీడా మైదానాల కోసం యువత, శనివారం ఉద్యోగ సాధన– అవకాశాలతో ప్రతిభ అనుసంధానం, మే 1న నిర్వహించిన జాబ్‌ మేళాలో సెలెక్ట్‌ అయిన అభ్యర్ధులకు ఆఫరింగ్‌, అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌, ఆర్డర్స్‌ అందజేస్తామన్నారు. అలాగే సీఎం కప్‌–2025లో గెలుపొందిన వారికి మెడల్స్‌, క్రీడా వారోత్సవాల్లో భాగంగా మే 21న జరిగిన క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు.

పర్యాటక వారోత్సవాలు ఇలా..

మంగళవారం కోయిల్‌సాగర్‌ ప్రాజెక్ట్‌ వద్ద టూరిజం అవేర్నెస్‌ డ్రైవ్‌, బుధవారం పిల్లలమర్రి వద్ద హెరిటేజ్‌ వాక్‌, గురువారం పిల్లలమర్రి మ్యూజియం, పర్యాటక కేంద్రాల్లో యువత, పిల్లలచే స్వచ్ఛత డ్రైవ్‌ నిర్వహిస్తారు. శుక్రవారం టూరిజం బ్రాండ్‌ కిట్‌ పోస్టర్‌ విడుదల, టూరిజం వీక్‌లో భాగంగా టూరిజం క్విజ్‌, పాల్గొన్న వారికి కలెక్టరేట్‌లో సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లాలోని యువత, యువజన, క్రీడా సంఘాలు, ఒలింపిక్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు అందరూ భాగస్వామ్యమై విజయవంతం చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ రాజశేఖర్‌రెడ్డి, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ రామంజులరెడ్డి, డీపీఆర్‌ఓ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement