కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి సభ ఏర్పాటు పనులు చేస్తున్న నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన కూలీ గోపాల బాలయ్య(60) శనివారం రాత్రి మృతిచెందాడు. తోటి కూలీల కథనం ప్రకారం.. అస్వస్థతకు గురైన బాలయ్యను వెంటనే పోలీసులు తమ వాహనంలో భూపాలపల్లి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరగంల్‌లోని ఎంజీఎంకు తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన మృతికి గుండెపోటా.. మరేదైనా కారణమో తెలియాల్సి ఉంది. సీఎం సభకు ముందే కూలీ చనిపోయి విషాదం నెలకొనడంతో అధికారులు అంతా గోప్యంగా ఉంచుతున్నారని తెలిసింది. బాలయ్య స్టేజీ, బారీకేడు పనులు చేశాడని తోటి కూలీలు పేర్కొన్నారు.
జక్లేర్‌లో భారీ చోరీ
● 20 తులాల బంగారం,
రూ. 4 లక్షల నగదు అపహరణ
మక్తల్: మండలంలోని జక్లేర్ గ్రామంలో భారీగా దొంగతనం జరిగిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నాగరాజ్‌రెడ్డి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బీరువా తాళాలు పగులగొట్టి 20 తులాల బంగారం, రూ.4 లక్షల నగదు చోరీ చేశారు. శనివారం రాత్రికి భార్యతో కలిసి తన సెల్‌ఫోన్ షాపుకు వెళ్లి తిరిగి ఇంటి ఇంటికి రాగా తలుపులు తెరచి ఉండటంతో పాటు బీరువా తాళాలు పగులగొట్టి బంగారం, నగదు చోరీ జరిగినట్లు గుర్తించారు. అనంతరం మక్తల్ పోలీసులకు సమాచారం అందించగా మక్తల్ ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డి క్లూటీంతో ఇంట్లో వేలిముద్రలు స్వీకరించారు. ఆదివారం బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
విద్యుదాఘాతంతో
కార్మికుడు మృతి
కందనూలు: విద్యుత్ మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి చెందిన ఘటన ఆదివారం జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హౌసింగ్ బోర్డ్ సబ్‌స్టేషన్ వద్ద మరమ్మతు పనులు చేస్తున్న కార్మికుడిని జంపర్ మార్చడానికి ట్రాన్స్‌కో ఉద్యోగులు వెంకటేష్ (35)ను వారి వెంట తీసుకువెళ్లినట్లు తోటి కార్మికులు తెలిపారు. సబ్‌స్టేషన్ మరమ్మతు పనులు జరుగుతున్న మరో లైన్‌లో విద్యుత్ సరఫరా ఉండటాన్ని గమనించని అధికారులు కార్మికుడిని జంపర్ మార్చమని సూచించడంతో అతడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం వెంకటేష్‌ను జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని జిల్లా జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడు కొల్లాపూర్ నియోజకవర్గంలోని కుడికిల్ల గ్రామానికి చెందినవాడు కాగా.. భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనకు సంబంధించి ఎస్‌ఐ గోవర్ధన్ వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
వరికోత మిషన్‌కు
వైర్లు తగిలి యువకుడు
హన్వాడ: కోయిల్‌కొండ మండలంలోని అభంగపట్నం గ్రామంలో వరికోత మిషన్ వైర్లకు తగలడంతో ఓ యువకుడు మృత్యువాత పడిన ఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హన్వాడ మండలంలోని యారోనిపల్లి గ్రామానికి చెందిన బీసు సతీష్‌కుమార్‌రెడ్డి (21) తన వరికోత మిషన్‌తో అభంగపట్నం గ్రామానికి వరి పైరును కోసేందుకు వెళ్లాడు. రాత్రి సమయంలో వరికోత పనులు జరుగుతుండగా.. పొలాల మధ్య ఉన్న విద్యుత్ వైర్లు వరికోత మిషన్‌కు తగలడంతో ఆపరేట్ చేస్తున్న సతీష్‌కుమార్‌రెడ్డి విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే గమనించిన స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం జిల్లాకేంద్రంలోని నవోదయ ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
యువకుడి అదృశ్యం
● కోనేరులో మునిగాడని అనుమానం
గోపాల్‌పేట: మండల కేంద్రంలోని రాంనగర్ కాలనీకి చెందిన ఓ యువకుడు మధ్యాహ్నం ఇంటి నుంచి మళ్లీ తిరిగి రాలేదు. పూర్తి వివరాలు.. మండల కేంద్రంలోని రాంనగర్ కాలనీకి చెందిన సాయమ్మ కొడుకు శ్రీనివాసులు ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో తన తల్లి వెతకగా కోదండరామస్వామి ఆలయం ఎదుట ఉన్న కోనేరు వద్ద శ్రీనివాసులుకు చెందిన ద్విచక్రవాహనం, చెప్పులు, బట్టలు కనిపించాయి. దీంతో తన కోనేరులోనే దిగి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం ఇచ్చారు. ఫైర్ అధికారులు ఫైర్ ఇంజిన్‌తోపాటు కోనేరు దగ్గరికి రాగా చీకటి పడటంతో గాలింపు చర్యలు ఆపేసినట్లు ఫైర్ డిపార్ట్‌మెంట్ ఇన్‌చార్జి శ్రీనివాసులు తెలిపారు.


