కబళించిన అతివేగం | - | Sakshi
Sakshi News home page

కబళించిన అతివేగం

Apr 20 2026 9:47 AM | Updated on Apr 20 2026 9:47 AM

వెనక నుంచి లారీని ఢీకొట్టిన కారు

తల్లి, ఐదు నెలల కుమారుడి

దుర్మరణం

దైవదర్శనానికి

వెళ్తుండగా ఘటన

అడ్డాకుల: అతివేగం ఓ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. వెనక నుంచి ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీకొట్టడంతో తల్లి, ఐదు నెలల కుమారుడు మృతి చెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున అడ్డాకుల శివారులోజాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని కంచిరావుపల్లికి చెందిన ప్రకాష్‌రెడ్డి భార్య నందిని (21), ఐదు నెలల కుమారుడు కన్నయ్యతో కలిసి యాదగిరిగుట్ట దైవదర్శనానికి తెల్లవారుజామున కారులో బయలుదేరాడు. మార్గమధ్యలో అడ్డాకుల శివారులోని స్నేహ పరిశ్రమ ఎదురుగా ఉన్న పెట్రోల్‌ బంకు సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు అతివేగంగా ఢీకొట్టుకుంది. ప్రమాదంలో కారు ఎడమ సీట్లో కూర్చున్న నందిని తల భాగం పూర్తిగా ఛిద్రమై రోడ్డుపై పడింది. నందిని ఒళ్లో కూర్చున్న బాలుడు కారు ముందు భాగంలో ఇరుక్కుని ప్రాణాలు వదిలాడు. ఇక కారు డ్రైవింగ్‌ సీట్లో ఉన్న ప్రకాష్‌రెడ్డి సీటు బెల్టు ధరించడంతో ఎయిర్‌ బెలూన్‌ తెరుచుకున్నప్పటికీ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఘటన స్థలానికి చేరుకొని తల్లీకొడుకుల మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ప్రకాష్‌రెడ్డిని అంబులెన్స్‌లో వనపర్తి జిల్లా కేంద్రానికి పంపించారు. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఏదైనా వాహనాన్ని ఓవర్‌ టెక్‌ చేసే క్రమంలో ఎడమ వైపు వచ్చినప్పుడు ప్రమాదవశాత్తు ఆగి ఉన్న లారీ వెనుక ఢీకొట్టాడా.. నిద్రమత్తులో ప్రమాదం జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది. మెరుగైన చికిత్స కోసం ప్రకాష్‌రెడ్డిని హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించినట్లు తెలిసింది. బాధితుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

చెప్పులే ప్రమాదానికి కారణమా!

కారు నడిపేటప్పుడు ప్రకాష్‌రెడ్డి తాను ధరించిన శాండిల్స్‌ను డ్రైవింగ్‌ సీటు వద్దే వదిలాడు. వేగంగా వెళ్తున్న క్రమంలో ముందు వెళ్తున్న వాహనాన్ని దాటే ప్రయత్నంలో బ్రేక్‌ వేయడానికి ప్రయత్నించిన సమయంలో శాండిల్స్‌ బ్రేక్‌ పెడాల్‌ కిందకి వచ్చి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనివల్లే బ్రేక్‌ వేయడానికి వీలు కాకపోవడంతో కారు వెళ్తున్న వేగంతోనే లారీని ఢీకొట్టి ఉంటుందని, అందువల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. లారీని కారు తగిలే సమయంలో బ్రేక్‌ వేసి ఉంటే ప్రమాద తీవ్రత ఇంత ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు. డ్రైవింగ్‌ చేసే సమయంలో కాళ్ల వద్ద చెప్పులు, వాటర్‌ బాటిళ్లు, ఇతర వస్తువులు పెట్టొద్దని, గతంలో కూడా ఇలాగే పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని నిపుణులు అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement