పురుగుల నిర్మూలన
పోషకాల పెంపు
అలంపూర్: పంటల సాగులో జాగ్రత్తలు పాటిస్తే అధిక లాభాలు ఆర్జించవచ్చు. యాసంగి పంట ముగిసిన తర్వాత వానాకాలం పంట సాగు చేసే ముందు వేసవిలో భూములను దున్నడం పంటకు ఎంతో మేలు చేస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. వేసవి దుక్కిలు పంటకు లాభం చేకూర్చుతాయని వివరిస్తున్నారు. రైతులు అధికారుల సూచనలు, సలహాలు పాటించాలని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియా నాయక్ కోరుతున్నారు. వేసవి దుక్కి అంటే..
వానాకాలం సాగుకు ముందుగా వేసవిలో పొలాన్ని లోతుగా దున్నే విధానాన్ని వేసవి దుక్కి అంటారు.
కలుపు నివారణ
లోతు దుక్కుల వలన పొలంలో ఉండే మొండి జాతి కలుపు మొక్కలైన గరిక, తుంగ వంటి మొదలగు దుంపలతో సహా తొలగించవచ్చు. దీంతో ఎండిపోయిన కలుపు సమస్య తగ్గుతుంది. పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది.
తెగుళ్ల నివారణ
భూమిలో ఉండి సాగుకాలంలో పైరును ఆశించే వివిధ రకాల శీలింధ్రాలు వేసవిలో చేపట్టే లోతు దుక్కుల వలన ఎండ తాకిడికి చనిపోతాయి. తర్వాత పంట కాలంలో ఈ తెగుళ్ల తీవ్రత తగ్గుతుంది. వివిధ పంటల్లో ఎండు తెగుళ్లును వేసవి దుక్కుల వలన తగ్గుముఖం పట్టించవచ్చు.
దుక్కులతో ప్రయోజనాలు
ప్రాథమికంగా వేసవి దుక్కుల వలన తొలకరిలో పడే వర్షపు నీరు నేలలోకి బాగా ఇంకి భూగర్భ నీటి మట్టం పెరుగుతుంది. దీంతోపాటు నేలలో తేమ నిల్వ శాతం వృద్ధి చెందుతుంది. నీరు బాగ ఇంకడం వలన నేల గుల్లబారి విత్తనం నాటేందుకు అనుకూలంగా మారుతుంది. తద్వారా మొలక శాతం పెరుగుతుంది. ముందు పంట మొదళ్లు, చెత్త ఆకులు, నేలలో కలిసి సేంద్రియ పదార్థంగా మారి నేల సారం పెరుగుతుంది.
తొలకరి వర్షాలు పడిన వెంటనే భూమిని లోతుగా దున్ని క్రింది నేలను పైకి వచ్చేట్లు చేయడం వలన నిద్రావస్థలో ఉన్న వివిధ పురుగుల గుడ్లు, ప్యూపాలు సూర్యరశ్మితాకిడికి చనిపోతాయి. వేసవి దుక్కులతో వరి పైరును ఆశించే కాండం తొలుచు పురుగు మొక్కజొన్నలో వచ్చే పురుగుల ఉధృతిని తగ్గింవచ్చు.
నేలలోపల గట్టి పొరలను పగులగొట్టడంతో మొక్కల వేరు వ్యవస్థ లోపలికి చొచ్చుకొని వస్తాయి. వేరు వ్యవస్థ నేలలోకి బాగా విస్తరించడం వలన మొక్కల ఎదుగుదలకు కావాలసినంత తేమ పోషకాలు సమకూరుతాయి. దీంతో నాణ్యమైన దిగుబడి వస్తుంది. పంటలకు మేలు చేసే సూక్ష్మజీవుల చర్యలను అభివృద్ధి చేసేందుకు వేసవి దుక్కిలు దోహదం చేస్తాయి.


