అలంపూర్: వ్యక్తిగత జీవితంలో విలువలే ప్రాణమని బహుజన ఉద్యమ కవి, తెలంగాణ రాష్ట్ర అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని ఒక ఫంక్షన్ హాల్‌లో మేదక్ జిల్లా సీఐడీ ఎస్పీ సంధ్యపోగు మహేందర్ పదవీ విరమణ మహోత్సవం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి బహుజన ఉద్యమ కవి, తెలంగాణ రాష్ట్ర అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ రామానంద తీర్థ, గ్రామీణ విద్యాసంస్థ చైర్మన్ నారా కిషోర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రిటైర్డు ఎస్పీ మహేందర్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. సామాజిక, కుటుంబ విలువలు చిద్రమవుతున్న కాలంలో విలువలతో జీవితాన్ని కొనసాగిస్తూ నిలిచిన వ్యక్తులను సమాజం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పోలీస్ శాఖలో 35ఏళ్లు పనిచేసి ఆ శాఖ గౌరవాన్ని పెంచిన అరుదైన వ్యక్తుల్లో సంధ్యపోగు మహేందర్ ఒకరని కొనియాడారు. అట్టడుగు వర్గం నుంచి వచ్చిన మహేందర్ పోలీస్ అధికారిగా సమన్యాయం పాటిస్తూ వ్యక్తిగత జీవితంలో విలువలే ఆదర్శంగా సేవలు అందించారన్నారు. వృత్తిరీత్యా పోలీస్ శాఖలో అనేక ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. కుటుంబ విలువలే మంచి సమాజ నిర్మాణానికి బలమైన పునాదులు వేస్తాయన్నారు. కార్యక్రమంలో నల్గొండ ఇంటలిజెన్స్ ఎస్పీ శ్రీనివాసులు, మెదక్ జిల్లాకు చెందిన పలువురు పోలీస్ అధికారులు, బంధువులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు.


