
కొత్త సత్రంలో అన్నప్రసాదం కొరత
అలంపూర్: ప్రసాద్ స్కీంలో భాగంగా శ్రీ బాలబ్రహ్మేశ్వరస్వామి నిత్య అన్నదాన సత్రంలో శుక్రవారం భక్తులకు అన్నప్రసాద కొరత ఏర్పడింది. అన్నదానంపై నిర్వాహకులు ఆలయాల్లో ప్రచారం చేయడంతో దర్శనానికి వచ్చిన భక్తులు ఒక్కసారిగా సత్రం వద్దకు చేరుకోవడంతో అన్నప్రసాదం కొరత నెలకొంది. శ్రావణ మాసం రెండో శుక్రవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు. స్వామి వారి దర్శనం అనంతరం భక్తులు మధ్యాహ్న సమయంలో అన్నదాన సత్రానికి ఒక్కసారి వెళ్లడంతో క్యూలైన్లలో బారులు తీరారు. భోజన హాల్ నిండిపోవడంతో ఆలయ సిబ్బంది బయట ఉన్న భక్తులను లోపలికి రానివ్వలేదు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు బీజేపీ స్థానిక నాయకులతో కలిసి అన్నదాన సత్రాన్ని సందర్శించారు. భక్తుల ఇబ్బందులను ఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. రూ. 10 కోట్ల ఆదాయం ఉన్న ఆలయంలో కనీసం భక్తులకు అన్నప్రసాదం అందజేయకపోతే ఎలా అని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌శర్మ ప్రశ్నించారు. ఈ విషయమై ఆలయ ఈఓ పురేందర్‌కుమార్ స్పందిస్తూ.. రోజు మాదిరిగానే అన్న ప్రసాదం తయారు చేశామని, కానీ ఒక్కసారి భక్తుల రద్దీ పెరగడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. అయినా భక్తులందరికీ అన్నప్రసాదం దశల వారిగా అందించామని తెలిపారు. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామన్నారు.