
చివరి ఆయకట్టుకు సాగునీరందిస్తాం
వెల్దండ: కల్వకుర్తి ఎత్తిపోథల పథకం ద్వారా చివరి ఆయకట్టు రంగారెడ్డి జిల్లా నాగిళ్ల వరకు రైతులకు సాగునీరందించడానికి కృషిచేస్తామని ఎస్‌ఈ సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ఆయా గ్రామాల్లోని కేఎల్‌ఐ కాల్వలను అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేఎల్‌ఐ కాల్వలో భాగంగా డి–82కాల్వ ద్వారా రైతులకు సాగునీరందిస్తామన్నారు. రైతులు ఇష్టానుసారంగా కాల్వపై సిమెంట్ పైపులు వేసి దారులు చేయడంతో కాల్వలకు గండిపడుతున్నట్లు తెలిపారు. వ్యవసాయ పొలాలకు వెళ్లాడానికి కాల్వకు అడ్డంగా సిమెంట్ పైపులు వేయడంతో నీటి ప్రవాహంతో పైపులకు చెత్తాచెదారం అడ్డు పడడంతో తరచుగా కాల్వలకు గండిపడి నష్టం కలుగుతుదన్నారు. చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించడానికి ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు వివరించారు. డి–82 కాల్వ పనులు దాదాపుగా పూర్తి చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా మరమ్మతులు ఉంటే వెంటనే పూర్తి చేసి కేఎల్‌ఐ కాల్వ నీరు పారించడానికి కృషిచేస్తున్నట్లు వివరించారు. వెల్దండ సమీపంలో కాల్వను పరిశీలించిన అధికారులను కాల్వపై వంతెనే నిర్మించాలని రైతులు విన్నవించారు. నిధులు మంజూరైన వెంటనే పనులు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఈఈ శ్రీకాంత్, డీఈఈలు దేవన్న, బుచ్చిబాబు, ఏఈలు ప్రభాకర్, మాల్య తదితరులు ఉన్నారు.
కేఎల్‌ఐ ఎస్‌ఈ సత్యనారాయణరెడ్డి