
రుణ లక్ష్యం రూ.385 కోట్లు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): మహిళా సంఘా ల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రుణాలు ఇస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025– 26)లో జిల్లాలోని మహిళలకు రుణాలు ఇవ్వడానికి అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. మహిళలకు రుణాలు ఇచ్చి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం బ్యాంక్ లింకేజీ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏడాదికేడాది రుణ లక్ష్యం పెంచుతోంది. దీంతో జిల్లాలో మహిళా సంఘాలు ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రుణాలు పొందుతూ.. ఆర్థిక పరిపుష్టి సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనట్లుగా అధికారులు బ్యాంక్ లింకేజీ రుణాలు ఈ స్థాయిలో ఇచ్చిన దాఖలాలు లేవు. లక్ష్యం చేరడమే గగనంగా ఉండే దిశ నుంచి అంతకు మించి రుణాలు ఇస్తున్నారు. కాగా.. జిల్లాలోని 754 మహిళా సంఘాలకు ఇప్పటికే రూ.74 కోట్లు పంపిణీ చేశారు.
మండలాల వారీగా..
జిల్లాలోని 8,758 మహిళా సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.385.70 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో అత్యధికంగా కోయిల్‌కొండ మండలంలోని 934 సంఘాలకు రూ.36.26 కోట్లు, అత్యల్పంగా అడ్డాకుల మండలంలోని 419 సంఘాలకు రూ.16.25 కోట్లు కేటాయించారు. అలాగే మహబూబ్‌నగర్‌లోని 794 సంఘాలకు రూ.31.26 కోట్లు, మహమ్మదాబాద్‌లోని 613 సంఘాలకు రూ.24.20 కోట్లు, హన్వాడలోని 872 సంఘాలకు రూ.33.64 కోట్లు, నవాబ్‌పేటలోని 853 సంఘాలకు రూ.32.88 కోట్లు, భూత్పూర్‌లోని 489 సంఘాలకు రూ.19.74 కోట్లు, జడ్చర్లలోని 730 సంఘాలకు రూ.27.80 కోట్లు, దేవరకద్రలోని 687 సంఘాలకు రూ.27.54 కోట్లు, బాలానగర్‌లోని 667 సంఘాలకు రూ.26 కోట్లు, చిన్నచింతకుంటలోని 800 సంఘాలకు రూ.30.74 కోట్లు, గండేడ్‌లోని 657 సంఘాలకు రూ.24.98 కోట్లు, రాజాపూర్‌లోని 482 సంఘాలకు రూ.19.62 కోట్లు, మిడ్జిల్ మండలంలోని 456 సంఘాలకు రూ.18.35 కోట్ల రుణాలు ఇవ్వనున్నారు.
జిల్లాలో 8,758 మహిళా
సంఘాలకు ఇవ్వాలని నిర్ణయం
కోయిల్‌కొండకు అధికంగా రూ.36.26 కోట్లు..
అత్యల్పంగా అడ్డాకులకు రూ.16.25 కోట్లు కేటాయింపు
మహిళా సంఘాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు..