
విద్యాభివృద్ధి ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): విద్యాభివృద్ధి ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌హాల్‌లో మహబూబ్‌నగర్ ఫస్ట్, వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన శత శాతం వలంటీర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా శత శాతం కార్యక్రమాన్ని మహబూబ్‌నగర్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎం విద్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. రూ.వేల కోట్ల నిధులు విద్యపై ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. మన మహబూబ్‌నగర్ పిల్లల భవిష్యత్ కోసం వందేమాతం ఫౌండేషన్‌తో కలిసి మహబూబ్‌నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో ఒక మంచి ఆలోచనతో శత శాతం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు.తమ ప్రభుత్వం వచ్చాక పదో విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ఇవ్వడం వల్ల 54 శాతం ఉన్న ఫలితాలో 85 శాతానికి పెరిగాయన్నారు. గతేడాది పయనీర్ కార్యక్రమంలో ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడం వల్ల 114 మంది పేద విద్యార్థులకు ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులలో ఉచితంగా ప్రవేశాలు పొందారని అన్నారు. కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌ను ఎడ్యుకేషన్‌హబ్‌గా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎమ్మెల్యే ముందుకు సాగుతున్నారని అన్నారు. ప్రతి పాఠశాలలో డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్‌ను తన సొంత నిధులతో ఉచితంగా అందించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహీరెడ్డి, డీఈఓ ప్రవీణ్‌కుమార్, వందేమాతరం ఫౌండేషన్ సభ్యులు రవిందర్, మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకుడు గుండామనోహర్, ఏఎంఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.