పరీక్షల కోసం వెళ్తే ప్రాణం తీశారు.. | - | Sakshi
Sakshi News home page

పరీక్షల కోసం వెళ్తే ప్రాణం తీశారు..

Aug 1 2025 12:21 PM | Updated on Aug 2 2025 10:22 AM

పరీక్

పరీక్షల కోసం వెళ్తే ప్రాణం తీశారు..

అచ్చంపేట రూరల్‌: వైద్య పరీక్షల కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిన నిండు గర్భిణికి హడావుడిగా సిజేరియన్‌ చేయడంతో తీవ్ర రక్తస్రావమై మృతిచెందింది. ఈ దుర్ఘటన అచ్చంపేట పట్టణంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఉప్పునుంతల మండలం అయ్యవారిపల్లికి చెందిన గర్భిణి శ్రావణి (22) బుధవారం వైద్య పరీక్షల నిమిత్తం అచ్చంపేటలోని ఎంఎంఆర్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి వచ్చింది. పరీక్షించిన వైద్యుడు కడుపులో బిడ్డ ఉమ్మనీరు మింగిందని.. వెంటనే ఆపరేషన్‌ చేయకపోతే తల్లీబిడ్డ ప్రాణాలకే ప్రమాదమని కుటుంబ సభ్యులకు చెప్పాడు. రెండు ప్రాణాలకు ఆపాయం ఉండటంతో వారు సిజేరియన్‌కు ఒప్పుకొన్నారు. అయితే మగబిడ్డకు జన్మనిచ్చిన శ్రావణికి కొంత సేపటికే అధిక రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. విషయం తెలుసుకున్న ఆస్పత్రి వైద్యుడు (జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త) తన స్వంత కారులో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది.

బంధువుల ఆందోళన..

తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ మృతురాలి బంధువులు ఎంఎంఆర్‌ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వారికి పలు సంఘాల నాయకులు మద్దతు పలికారు. ఆస్పత్రి గుర్తింపు రద్దు చేయాలని, బాలింత మృతికి కారకులైన వైద్యుడు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రసవానికి పది రోజుల సమయం ఉన్నా.. డబ్బుల కోసం హడావుడిగా ఆపరేషన్‌ చేయడంతోనే శ్రావణి మృతి చెందిందని వారు ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట 6గంటల పాటు అంబులెన్స్‌లోనే శ్రావణి మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేశారు.

ఏడాదిక్రితమే వివాహం..

శ్రావణి స్వగ్రామం అమ్రాబాద్‌ మండలం మన్ననూర్‌లోని ప్రశాంత్‌నగర్‌ కాలనీ. అయ్యవారిపల్లికి చెందిన ఎల్లస్వామితో ఏడాది క్రితమే శ్రావణికి వివాహం కాగా.. జూలై 25న పెళ్లి రోజు వేడుక జరుపుకొన్నారు. అయితే మొదటి కాన్పులో మగశిశువుకు జన్మనిచ్చిన శ్రావణి గంటల వ్యవధిలోనే మృతిచెందడం కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది.

రూ. 9లక్షలకు ప్రాణం ఖరీదు..

మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు పెద్దఎత్తున ప్రైవేటు ఆస్పత్రికి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులతో సెటిల్‌మెంట్‌ చేసుకోవాలని సదరు ఆస్పత్రి వైద్యుడిపై పోలీసులే ఒత్తిడి తేవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. బాలింత ప్రాణం ఖరీదు రూ. 9లక్షలకు సెటిల్‌ అయినట్లు తెలిసింది. ఈ విషయమై ఎస్‌ఐ విజయభాస్కర్‌ను వివరణ కోరగా.. మృతురాలి తల్లి తిరుపతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

తీవ్ర రక్తస్రావంతో బాలింత మృతి

మగబిడ్డకు జన్మనిచ్చి.. తనువు చాలించిన వైనం

ఆస్పత్రి ఎదుట మృతదేహంతో కుటుంబ సభ్యుల ఆందోళన

పరీక్షల కోసం వెళ్తే ప్రాణం తీశారు.. 1
1/1

పరీక్షల కోసం వెళ్తే ప్రాణం తీశారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement