
అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం
అలంపూర్: అధికార, ప్రతిపక్ష పార్టీల నేత మధ్య రగడ నెలకొంది. స్థానికంగా పట్టు కోసం నువ్వా నేనా అన్నట్లుగా అధికార ప్రతిపక్ష నేతలు పోటీపడ్డారు. సజావుగా సాగాల్సిన మంత్రి పర్యటన ఉద్రిక్తతలకు దారిసింది. అలంపూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు. మంత్రికి స్వాగతం పలికేందుకు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ అలంపూర్ చౌరస్తాకు రాగా.. అదే సమయంలో బీఆర్‌ఎస్‌కు చెందిన స్థానిక ఎమ్మెల్యే విజయుడి మంత్రికి స్వాగతం పలికేందుకు వచ్చారు. ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారికి ఎమ్మెల్యేకు కొంత వాదనలు జరిగింది. మంత్రికి ఎమ్మెల్యే స్వాగతం పలికారు. ఈ క్రమంలో జరిగిన పరిణామాలతో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సభావేతాక వద్దకు వెళ్లకుండా బయటే ఉండిపోయారు. సమావేశంలో ఎమ్మెల్యే ప్రసంగిస్తూ కాంగ్రెస్‌లోని స్థానిక నేతలు కమీషన్ల దందా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. మట్టి, ఇసుకతో పాటు ప్రతి దానికి ఒక రేట్ కట్టి వసూళ్లు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అనంతరం మార్కెట్ చైర్మన్ దొడ్డెప్ప మాట్లాడుతూ...బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ 18 నెలల పాలనలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే తర్వాత మంత్రి మాట్లాడాల్సి ఉండగా మార్కెట్ యార్డు చైర్మన్‌కు ఎలా ఇస్తారని ఎమ్మెల్యే ప్రస్తావించారు. ఆరోపణలు మరోసారి ప్రస్తావించారు. దీంతో ఇటు ఎమ్మెల్యే.. అటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్ బీఎం సంతోష్ ఇరువురిని వారించి నచ్చజెప్పారు. అనంతరం అన్నదాన సత్రం ప్రారంభోత్సవంలో ఎవరికి వారు అన్నట్లుగా వ్యవహరించారు. ముందుగా ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఆ తర్వాత ఎమ్మెల్యే, చివరగా సాయంత్రం మంత్రి అన్నదాన సత్రంలో పూజలు చేశారు. ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు పోటాపోటీగా మాటల యుద్ధం, వాగ్వాదాలతో మంత్రి పర్యటన ముగిసింది.
అలంపూర్‌లో మంత్రి, అధికారుల ఎదుట నేతల వాగ్వాదం
ఉద్రిక్తంగా సాగిన మంత్రి వాకిటి పర్యటన