
జూరాలకు భారీ వరద
ధరూరు/ రాజోళి/ ఆత్మకూర్: ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీ ఎత్తున వరద నీరు వస్తుంది. బుధవారం ప్రాజెక్టుకు 1.78 లక్షల ఇన్‌ఫ్లో ఉండగా.. గురువారం రాత్రి 8 గంటల వరకు 2.01 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. ప్రస్తుత సీజన్‌లో ఇంత పెద్దఎత్తున వరద రావడం ఇదే మొదటిసారి. దీంతో ప్రాజెక్టు వద్ద 18 క్రస్టు గేట్లను ఎత్తి గేట్లను ఎత్తి దిగువకు 1,79,316 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 25,205 క్యూసెక్కులు వదులుతున్నారు. అలాగే కోయిల్‌సాగర్ ఎత్తిపోతలకు 315 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 750, ఎడమ కాల్వకు 1,250, కుడి కాల్వకు 650, సమాంతర కాల్వకు 800, భీమా లిఫ్టు–2కు 750 క్యూసెక్కులు వదలగా.. 43 క్యూసెక్కులు ఆవిరైంది. మొత్తం ప్రాజెక్టు నుంచి 2.08 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.914 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉండగా.. ఎగువనున్న ఆల్మట్టి ప్రాజెక్టుకు 1,57,170 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. దిగువకు 1.40 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. అలాగే నారాయణపూర్ ప్రాజెక్టుకు 1.35 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది.
● జూరాలలోని ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో గురువారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్ల విద్యుదుత్పత్తి సాధించామన్నారు.
సుంకేసులకు తగ్గిన ఇన్‌ఫ్లో
సుంకేసులకు ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది. రెండు రోజులుగా లక్ష క్యూసెక్కులకు పైగా కొనసాగిన ఇన్‌ఫ్లో గురువారం 72 వేల క్యూసెక్కులకు చేరింది. దీంతో అధికారులు 18 గేట్లను ఒక మీటరు మేర తెరిచి 69,138 క్యూసెక్కులను దిగువకు, కేసీ కెనాల్‌కు 1,847 క్యూసెక్కులు వదిలినట్లు జేఈ మహేంద్ర తెలిపారు.
నిండుకుండలా రామన్‌పాడు జలాశయం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయం గురువారం పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండను తలపిస్తోంది. సముద్ర మట్టానికి పైన 1,021 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ కాల్వ నుంచి 1,184 క్యూసెక్కులు, సమాంతర కాల్వ నుంచి 775 క్యూసెక్కుల వరద కొన సాగుతుండగా.. ఎన్టీఆర్ కాల్వకు 1,040 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 45 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 273 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు ఆయన వివరించారు.
ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
18 క్రస్టు గేట్ల ఎత్తివేత.. దిగువకు 2.8 లక్షల క్యూసెక్కులు విడుదల