
బీసీ రిజర్వేషన్‌పై కేంద్ర మంత్రులు స్పందించాలి
అచ్చంపేట రూరల్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ స్పందించాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని టీఎన్‌జీఓ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజస్తాన్, గుజరాత్ రాష్ట్రాల్లో అమలవుతున్నట్టుగా తెలంగాణలోనూ ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్రం సహకరించాలన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతో పాకిస్తాన్, ఇండియా మధ్య యుద్ధం ఆగిందని అనేకసార్లు ప్రకటించారని, దీనిపై పార్లమెంట్‌లో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఇద్దరు బీజేపీ కేంద్ర మంత్రులు ఉన్నారని, కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి బీసీ రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారని, ఆ హామీలను అమలు చేయాలన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా.. ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో నిర్లక్ష్యం చేస్తుందని, దీనిపై ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో గ్రామస్థాయిలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పర్యటించి స్థానిక సమస్యలను అధ్యయనం చేసి ఎక్కడికక్కడ ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. అప్పటికీ స్పందించకపోతే రాష్ట్రస్థాయిలో భారీ ఎత్తున ప్రజా పోరాటాలు తప్పవని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు సాగర్, వెంకట్రాములు, ధర్మానాయక్, పర్వతాలు, దేశ్యానాయక్, శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.