
అర్చకుల సంక్షేమానికి నిరంతరం కృషి
స్టేషన్ మహబూబ్‌నగర్: దూప, దీప నైవేద్య అర్చకుల సంక్షేమం కోసం రాష్ట్ర దూప, దీప నైవేద్య అర్చక సంఘం నిరంతరం కృషి చేస్తుందని ఆ సంఘం ఉమ్మడి జిల్లా ప్రతినిధులు అన్నారు. మహబూబ్‌నగర్‌లో బుధవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలోని 6,750 మంది అర్చకుల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న రాష్ట్ర దూప, దీప నైవేద్య అర్చక సంఘంపై అర్చక వెల్ఫెర్ బోర్డు సభ్యుడు జక్కాపురం నారాయణస్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 14, 15, 16 తేదీల్లో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, లోకకల్యాణార్థం దూప, దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ ఆధ్వర్యంలో చండీ కుబేర పాశుపథ యాగాన్ని ది గ్విజయంగా పూర్తి చేసినట్లు తెలిపారు. దీనిని జీర్ణించుకోలేని కొందరు అర్చక సమాఖ్య నాయకులు ఏదో విధంగా దూప, దీప నైవేద్య అర్చక సంఘంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర దూప, దీప నైవేద్య అర్చక సంఘం చేస్తున్న కార్యక్రమాలకు అడ్డుపడవద్దని కోరారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి జి.రవికుమార్, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల, పేట జిల్లాల అధ్యక్షులు జంగం మహేష్, లక్ష్మికాంతాచార్యులు, చంద్రశేఖర్, చక్రవర్తి చార్యులు, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.