
‘108’లో ఆక్సిజన్ లేక రైతు మృతి?
మహబూబ్‌నగర్ క్రైం: ఛాతీలో నొప్పి రావడంతో 108 అంబులెన్స్‌లో తరలించే క్రమంలో అందులో ఆక్సిజన్ లేకపోవడంతో రైతు మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. మూసాపేట మండలం నిజాలాపూర్ గ్రామానికి చెందిన బొజ్జయ్య(65) బుధవారం తన వ్యవసాయ పొలంలో ఉండగా ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు మూసాపేటలోని ఓ ఆర్‌ఎంపీ దగ్గరకు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మహబూబ్‌నగర్ వెళ్లడానికి ‘108శ్రీకి కాల్ చేశారు. దాదాపు 20 నిమిషాల తర్వాత అక్కడికి చేరుకున్న 108 వాహనంలో బొజ్జయ్యను తీసుకుని జిల్లాకేంద్రంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బొజ్జయ్యను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. దీంతో మృతుడి కుటుంబసభ్యులు 108లో ఆక్సిజన్ సదుపాయం లేకపోవడం వల్లే మృతి చెందడని ఆరోపిస్తున్నారు. సిబ్బందికి ఆక్సిజన్ పెట్టాలని కోరినా పెట్టాలేదని వారు మండిపడ్డారు.ఈ ఘటనపై 108 మేనేజర్ రవిని వివరణ కోరగా.. జిల్లాలో ఉన్న ప్రతి 108లో ఆక్సిజన్ సౌకర్యం ఉంటుందని, ఈ అంబులెన్స్‌లో కూడా ఉందని తెలిపారు. మృతుడి కుటుంబసభ్యులే అంబులెన్స్ మహిళ టెక్నీషియన్‌పై దాడి చేశారని తెలిపారు.