
జడ్చర్లకు బైపాస్ మంజూరు
●
బైపాస్ సాధించుకుంటాం..
జడ్చర్ల బైపాస్ నిర్మాణానికిగాను బుధవారం ఎంపీ డీకే అరుణ, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఢిల్లీలో కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశాం. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను కూడా సమర్పించాం. పరిశీలించి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. నిరంతరం పర్యవేక్షణ చేస్తూ త్వరగా నిధులు మంజూరు చేయించేందుకు కృషిచేస్తాం.
– జనంపల్లి అనిరుధ్‌రెడ్డి,
ఎమ్మెల్యే, జడ్చర్ల
జడ్చర్ల టౌన్: జడ్చర్లలో బైపాస్ నిర్మాణానికి కేంద్ర రవాణాశాఖ ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. బుధవారం ఢిల్లీలో మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, జడ్చర్ల, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేలు జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కేంద్ర రవాణాశాఖమంత్రి నితిన్ గడ్కరీని కలిసి బైపాస్ ఆవశ్యకతను వివరించి ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను ఆయనకు అందజేశారు. డీపీఆర్ పరిశీలించి నిధులు విడుదల చేస్తామని కేంద్ర మంత్రి భరోసానిచ్చారు.
● దినదినాభివృద్ధి చెందుతున్న జడ్చర్ల మీదుగా 44, 167వ నంబరు రెండు జాతీయ రహదారులు వెళ్తున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గకేంద్రం మీదుగా 167వ నంబరు జాతీయ రహదారి వెళ్తోంది. రహదారి నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ రోడ్డుపై పదేళ్లలో వాహనాల రాకపోకలు నాలుగు రెట్లు పెరగడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. ఈ సమస్యను అధిగమించేందుకు బైపాస్ నిర్మాణం ఒక్కటే మార్గమని నిర్ణయించిన ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఇదివరకే రెండు పర్యాయాలు కేంద్రమంత్రిని కలిసి సమస్యను విన్నవించారు. బుధవారం మరోమారు మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఢిల్లీలో కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరిని కలిసి బైపాస్ ఆవశ్యకతను వివరించారు. ఎంపీ బైపాస్‌కు సంబంధించిన డీపీఆర్‌ను కేంద్ర మంత్రికి అందించారు. స్పందించిన మంత్రి బైపాస్ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో పాటు డీపీఆర్‌ను పరిశీలించాలని జాతీయ రహదారులశాఖ అధికారులను ఆదేశించారు. డీపీఆర్ పరిశీలన అనంతరం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
పట్టణ దక్షిణభాగం నుంచి..
జడ్చర్ల–మహబూబ్‌నగర్ 167వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న నక్కలబండ తండా నుంచి మల్లెబోయిన్‌పల్లి మీదుగా 44వ నంబరు జాతీయ రహదారిని కలుపుతూ తాటిపర్తి, ఆలూరు, బూర్గుపల్లి, కిష్టంపల్లి, నాగసాల, చర్లపల్లి మీదుగా గంగాపురం వద్ద తిరిగి అదే జాతీయ రహదారిని కలిపేలా ప్రతిపాదనలు రూపొందించారు. అలాగే మహబూబ్‌నగర్ బైపాస్ రహదారి పనుల్లో వేగం పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కేంద్రమంత్రిని కోరారు. ఇందుకు కూడా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.
కేంద్ర రవాణాశాఖ మంత్రిని కలిసిన
ఎంపీ, జడ్చర్ల, మహబూబ్‌నగర్
ఎమ్మెల్యేలు
డీపీఆర్ అందజేత.. పరిశీలించి నిధుల కేటాయింపునకు హామీ