
పింఛన్ పెంపు హామీ ఏమైంది?
గట్టు: వృద్ధులు, వికలాంగులకు ఇచ్చే పింఛన్లు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ ప్రశ్నించారు. బుధవారం గట్టు మండలం ముచ్చోనిపల్లెలో భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల కోసం రాజీ లేని పోరాటం చేసి, వారి బతుకుల్లో వెలుగులు నింపిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. అంబేడ్కర్ స్ఫూర్తితో యువత ముందుకుసాగాలని కోరారు. కాళ్లు, చేతులు లేనోళ్ల పింఛన్ డబ్బులు ఎగొట్టడం రేవంత్ సర్కారుకు భావ్యం కాదన్నారు. ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉన్న పింఛన్లు పెంచకుండా, కొత్త పింఛన్లు ఇవ్వకుండా 18వేల కోట్ల బడ్జెట్ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. నిస్సాహాయ స్థితిలో చేయూత పింఛన్‌పై ఆధారపడి జీవిస్తున్న వారికి అన్యాయం చేయొద్దన్నారు. పింఛన్‌దారుల బాధ అటు ప్రభుత్వానికి, ఇటు ప్రతిపక్షాలకు కనిపించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం దగా చేస్తుంటే రాజకీయ పార్టీలు ఎందుకు మౌనం వహిస్తున్నాయని ప్రశ్నించారు. పింఛన్‌దారులకు ఇచ్చిన హామీల సాధన కోసం వచ్చే నెల 13న హైదరాబాద్‌లో పెద్దఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత, బీఆర్‌ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి బల్గెర హనుమంతు నాయుడు, మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్, బీఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు కిషోర్‌కుమార్, కొంకల భీమన్న, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్ర సతీశ్ మాదిగ, ఎంఎస్‌ఎస్‌పీ జిల్లా కన్వీనర్ రాజు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి అశోక్, మండల అధ్యక్షుడు బల్గెర ఏసన్న తదితరులు పాల్గొన్నారు.
నిస్సాహాయ స్థితిలో జీవిస్తున్న
వారికి అన్యాయం చేయొద్దు
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక
అధ్యక్షుడు
మందకృష్ణమాదిగ
ముచ్చోనిపల్లెలో అంబేడ్కర్
విగ్రహావిష్కరణ