
జూరాలకు భారీ వరద
ధరూరు/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం 6.30 గంటల వరకు ప్రాజెక్టుకు లక్షా 78వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 15 క్రస్టు గేట్లను ఎత్తి లక్షా 49వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జల విద్యుత్ కేంద్రంలో 11 యూనిట్లలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 26,345 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315, నెట్టెపాడుకు 750, ఆవిరి రూపంలో 43, ఎడమ కాల్వకు 1,250, కుడి కాల్వకు 600, సమాంతర కాల్వకు 800.. ప్రాజెక్టు నుంచి మొత్తం లక్షా 79,413 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.894 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
పరుగులు పెడుతున్న విద్యుదుత్పత్తి
ప్రాజెక్టు ఎగువలో 5 యూనిట్ల ద్వారా 175.189 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 208.276 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 383.465 మిలియన్ యూనిట్లును విజయవంతంగా విద్యుదుత్పత్తిని చేపట్టామన్నారు.
15 క్రస్టు గేట్లు ఎత్తి
దిగువకు నీటి విడుదల