
పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు పేదలకు వరం
వంగూరు: తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు పేద విద్యార్థులకు వరమని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మరళి అన్నారు. నూతనంగా ఏర్పాటవుతున్న వంగూరు, పోల్కంపల్లి పాఠశాలల్లో నిర్వహణకు సంబంధించి గ్రామ అభివృద్ధి కమిటీ, ఎస్‌ఎంసీ కమిటీలతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనతో పాటు కమిటీ సభ్యులు చారకొండ వెంకటేష్, విశ్వేశ్వర్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగూరు, పోల్కంపల్లి పాఠశాలల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.31 కోట్ల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వ అధికారులతో పాటు గ్రామస్తుల సహకారం ఉండాలని కోరారు. వంగూరు పాఠశాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. అంతేకాకుండా నూతనంగా రెండు బస్సులు కొనడంతో పాటు ప్రహరీ, పరిసరాలను శుభ్రం చేయడం లాంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిధుల వినియోగంలో ఒక్క పైసా అవినీతి జరగకుండా చూడాలని సూచించారు. చారకొండ వెంకటేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సొంత మండలమైన వంగూరులోనే రెండు పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు. సమావేశంలో ఈఈ రాంచందర్, నోడల్ ఆఫీసర్ గోపాల్, ఎంఈఓ మురళీ మనోహరాచారి తదితరులు పాల్గొన్నారు.
రెండు
పాఠశాలలకు రూ.31 కోట్లు
మంజూరు
విద్యా కమిషన్ చైర్మన్
ఆకునూరి మరళి