
బోరవెల్లిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు
మానవపాడు: శతాబ్దాల చరిత్రగల బోరవెల్లి గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు కొన్ని రోజుల క్రితం గుప్తనిధుల తవ్వకాలు జరపగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, బుధవారం గ్రామంలో ఇరువురు అనుమానాస్పదంగా తిరుగుతుండగా గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్‌ఐ మురళి అక్కడికి చేరుకొని వారిని విచారించారు. పూర్తి వివరాలిలా.. చెన్నకేశవస్వామి ఆలయంలో కొందరు ఈ నెల 1 నుంచి 5వ తేదీ మధ్యలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. అనంతరం విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈక్రమంలో ఈ నెల 14న నాగర్‌కర్నూల్‌లో పనిచేసే ఓ ప్రభుత్వ ఉద్యోగి.. బోరవెల్లి చెన్నకేశవస్వామి ఆలయంలో పూజారిగా పనిచేసే రవీంద్రనాథ్‌కు ఫోన్ చేశాడని, మీ ఆలయంలో గుప్తనిధులు ఉన్నాయని, సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా అని ఆరా తీశాడన్నారు. నువ్వు మాకు సహకరించాలని లేదంటే నీ అంతు చూస్తానని భయభ్రాంతులకు గురిచేశాడని తెలిపారు. ఇదే విషయమై గ్రామస్తులంతా పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు. ఈక్రమంలో బుధవారం గ్రామంలో ఇద్దరు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకొని పోలీసులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ అక్కడికి చేరుకొని ఇరువురు వ్యక్తులను స్టేషన్‌కు తరలించారు. ఈక్రమంలో పూజారిని బెదిరించిన వ్యక్తిని గ్రామానికి రప్పించాలని, వారికి వీరికి సంబంధం ఉందంటూ గ్రామస్తులు పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు. అనంతరం వారిని స్టేషన్‌కు తరలించి విచారించారు. ఇదిలాఉండగా, పూజారి రవీంద్రచారి తనను ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తి అయిన ప్రభుత్వ ఉద్యోగిపై ఫిర్యాదు చేశాడు. అయితే, తవ్వకాల విషయమై విచారించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్‌ఐ తెలిపారు.