
కేజీబీవీలో విద్యార్థినికి పాముకాటు
ఉండవెల్లి: జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని కలుగోట్ల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో బుధవారం ఓ విద్యార్థిని పాముకాటుకు గురైంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని మెన్నిపాడుకు చెందిన దాక్షాయిని కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఉదయం 9:10 గంటలకు పాఠశాల ప్రాంగణంలో తోటి విద్యార్థినులతో కలిసి ప్రార్థన చేస్తుండగా.. పాముకాటుకు గురైంది. గమనించిన తోటి విద్యార్థినులు విషయాన్ని ఉపాధ్యాయులకు తెలియజేశారు. అక్కడే ఉన్న నర్సు లావణ్య విద్యార్థినికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకొని నాటువైద్యం నిమిత్తం ఇదే మండలం బొంకూరుకు తరలించి ఆకుపసరు తాగించారు. అనంతరం కేజీబీవీ సిబ్బందితో కలిసి ప్రైవేటు వాహనంలో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అక్కడి వైద్యులు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం దాక్షాయినిని తల్లిదండ్రులు తమ స్వగ్రామానికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే విజయుడు విద్యార్థిని తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కాగా, పాముకాటుకు గురైన విద్యార్థినికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే వరకు కేజీబీవీ ఎస్‌ఓ పరిమళ అందుబాటులో లేకపోవడం గమనార్హం. కేజీబీవీ సిబ్బందే విద్యార్థిని బాగోగులు చూసుకున్నారు. అయితే మధ్యాహ్నం తర్వాత కర్నూలు ఆస్పత్రికి ఎస్‌ఓ వెళ్లి విద్యార్థినిని పరామర్శించినట్లు తెలిసింది.
కర్నూలు ఆస్పత్రికి తరలింపు..
తప్పిన ప్రమాదం