
అన్నదాన సత్రంలో ప్రత్యేక పూజలు
అలంపూర్: అలంపూర్ ఆలయాల్లోని నిత్యాన్నదాన సత్రాన్ని కొత్తగా నిర్మించిన ప్రసాద్ స్కీం భవనంలోని ఓ బ్లాక్‌లోకి మార్చనున్నారు. ఈ సందర్భంగా బుధవారం కొత్త భవనంలో ఆలయ ఈఓ పురేందర్‌కుమార్, కమిటీ చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం మహా గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంప్రోక్షణ, రుత్విక్ వరుణం, మహా కలశ స్థాపన, వాస్తు మండపారాధన, గణపతి, నవగ్రహ, వాస్తు, రుద్రహోమం జరిగాయి. అనంతరం ఈఓ, చైర్మన్ అర్చకులకు దీక్షా వస్త్రాలు అందజేశారు. గురువారం తెల్లవారుజామున 4.34 గంటలకు గో సహిత గృహప్రవేశం, ఉదయం 11 గంటలకు పూర్ణాహుతి ఉంటుందని ఈఓ వివరించారు. మధ్యాహ్నం 12 గంటలకు జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి కల్యాణం, అనంతరం కొత్త అన్నదాన సత్రంలో భక్తులకు అన్న ప్రసాదం(భోజనం) ఉంటుందని తెలిపారు. ఈఓ, చైర్మన్ కొత్త అన్నదాన సత్రంలో ఏర్పాట్లను పరిశీలించారు.