
పెండింగ్ జీతాల కోసం ‘శిక్షణ’ బహిష్కరణ
మహబూబ్‌నగర్ రూరల్: నాలుగు నెలలుగా రావాల్సిన వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఉద్యోగులు శిక్షణ కార్యక్రమాన్ని బహిష్కరించారు. మంగళవారం మహబూబ్‌గర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలోని జిల్లాలోని వివిధ మండలాల ఏపీఓలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్లకు ఉపాఽధి పనులపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉపాధి హామీ ఉద్యోగులు ముందుగా తమకు రావాల్సిన వేతనాలు గురించి సమాధానం చెప్పాలంటూ కార్యక్రమాన్ని బహిష్కరించి.. కార్యాలయం ఎదుట రోడ్డుపై ఉద్యోగులంతా బైఠాయించి ఆందోళను దిగారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఉద్యోగుల జేఏసీ జిల్లా కన్వీనర్ రాజశేఖర్‌రెడ్డి, కో–కన్వీనర్ విజయభాస్కర్ మాట్లాడుతూ వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నామన్నారు. అసలే చాలీచాలని జీతాలు అవి కూడా సమయానికి రాకపోవడంతో కుటుంబపోషణకు అప్పులు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని అన్నారు. ప్రభుత్వం స్పందించి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్‌డీఓ నర్సింహులకు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధిహామీ పథకం ఈసీల సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణ, కంప్యూటర్ ఆపరేటర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సతీష్, ఏపీఓలు, ఈసీలు, టీఏలు పాల్గొన్నారు.