● రేపు ప్రసాద్ స్కీం భవంతిలోకి మార్పు
● నాలుగు నెలల క్రితమే అలంపూర్ ఆలయాలకు అప్పగింత
● వర్చువల్‌గా భవనాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి మోదీ
అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహేశ్వరస్వామి క్షేత్రంలో అన్నప్రసాదానికి కొత్త భవనం అందుబాటులోకి రానుంది. ప్రసాద్ స్కీం నిధులతో నిర్మించిన భవంతిలోకి బాలబ్రహ్మేశ్వరస్వామి అన్నదాన సత్రం ఏర్పాటుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆలయ అర్చక స్వాములు ఖరారు చేసిన ముహూర్తంలో అధికారులు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం భక్తులకు కొత్త భవనంలో అన్నప్రసాదం వసతి అందుబాటులోకి తీసుకురానున్నారు.
50 ఏళ్లుగా అన్నదాన సత్రం..
అలంపూర్ క్షేత్రంలో 50ఏళ్లుగా శ్రీగండ్రకోట కుమారశాస్త్రి బాలబ్రహ్మేశ్వరస్వామి అన్నదాన సత్రం పేరుతో అన్నప్రసాదం పంపినీ చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న అన్నదాన సత్రం పురావస్తుశాఖ అధ్వర్యంలో ఉంటుంది. ఈ క్షేత్రందినదినాభివృద్ధి చెంది భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగినప్పటికీ.. సత్రంలో 50నుంచి 100 మంది వరకు మాత్రమే భోజనం చేయడానికి అవకాశం ఉంది. దీంతో అన్నప్రసాదం పొందడానికి భక్తులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. పాత అన్నదాన సత్రంలో మార్పులు చేయడానికి పురావస్తు శాఖ నుంచి అనుమతులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో అసౌకర్యాల నడుమే సత్రం కొనసాగుతోంది.
రూ. 37కోట్ల వ్యయంతో కొత్త భవంతి..
కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీం ద్వారా రూ. 37కోట్లు మంజూరు చేయడంతో అన్ని హంగులతో భవనం నిర్మించారు. ఈ భవంతిలో ఒక బ్లాక్‌ను అన్నదాన సత్రం కోసం కేటాయించారు. ఇదివరకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఈ భవంతిని ప్రారంభించడంతో ఆలయాలకు అప్పగించారు. ప్రస్తుతం అన్నదాన సత్రం కోసం కేటాయించిన బ్లాక్‌లో 1000 మంది వరకు కూర్చోని తినడానికి అవకాశం ఉంటుంది. సాధారణ రోజుల్లో ఆలయాలకు 400 మంది వరకు భక్తులు అన్నప్రసాదం కోసం వస్తారని.. సెలవు దినాల్లో 800 నుంచి 1,200 మంది వరకు అన్నప్రసాదం కోసం వస్తారు. మహాశివరాత్రి, దేవీ శరన్ననవరాత్రులు, వసంతి పంచమి వంటి ప్రత్యేక రోజుల్లో అన్నప్రసాదం కోసం వచ్చే భక్తుల సంఖ్య భారీగా ఉంటుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా కొత్త భవనంలో పెద్ద హాల్‌తో పాటు కిచెన్, సరుకుల నిల్వకు ప్రత్యేక గదులు అందుబాటులోకి రానున్నాయి.
నేడు పూజలు.. రేపు ప్రారంభం
ప్రసాద్ స్కీం భవంతిలో అన్నదాన సత్రం ఏర్పాటు సందర్భంగా రెండు రోజులపాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ పురేందర్ కుమార్ తెలిపారు. బుధవారం ఉదయం 8 గంటలకు మహా గణపతి పూజ, పుణ్యహవచనం, సంప్రోక్షణ, ఋత్విక్ వరుణం, మహా కలశ స్థాపన, వాస్తు మండపారాధన, గణపతి, నవగ్రహ, వాస్తు, రుద్ర హోమాలు ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గురువారం తెల్లవారుజామున 4:34 గంటలకు గో సహిత గృహప్రవేశం, 11 గంటలకు పూర్ణాహుతి సమర్పణ ఉంటుందని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆదిదంపతులైన జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మద్యాహ్నం 1గంటకు అన్నదానం ఉంటుందని ఈఓ తెలిపారు.
అందుబాటులోకి సకల సౌకర్యాలు..
కొత్త భవనంలో అన్నప్రసాదం కోసం వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. భక్తులు కూర్చోని తినడానికి ఏర్పాటు ఉంటుంది. భక్తుల వాహనాల పార్కింగ్, ఇతర సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. భవిష్యత్‌లో ఇతర బ్లాక్‌లు సైతం అప్పగించే అవకాశం ఉంది. భవనం మొత్తం వినియోగంలోకి వస్తే భక్తులకు మరిన్ని సౌకర్యాలు పెరుగుతాయి.
– పురేందర్ కుమార్, ఈఓ
కొత్త భవనంలోకి అన్నదాన సత్రం
కొత్త భవనంలోకి అన్నదాన సత్రం