
అదే కాలుష్యం.. అంతే నిర్లక్ష్యం
రాజాపూర్: పరిశ్రమల నుంచి వ్యర్థాలను.. కలుషిత, రసాయన నీటిని పొలాల్లోకి వదులుతున్నారని.. పంటలు వేసినా పండడం లేదని.. కంపెనీల నుంచి వచ్చే పొగతో వాయుకాలుష్యం అవుతుందని.. ఎన్నోరకాలుగా ఇబ్బందులు పడుతున్నామంటూ పోలేపల్లి సెజ్ పరిసర గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. తాజాగా ప్రజావాణిలో పలు గ్రామాల రైతులు ఫిర్యాదు చేయడంతో అధికారులు తనిఖీలు చేయగా.. అదే కాలుష్యం.. అంతే నిర్లక్ష్యంతో సదరు కంపెనీలు, సిబ్బంది వ్యవహరించడం కనిపించింది. యథేచ్ఛగా పొలాల్లోకి కలుషిత నీటిని వదలడంతో అధికారులు హెచ్చరించారు. వివరాల్లోకి వెళ్తే.. రాజాపూర్ మండలం రాయపల్లి, ముదిరెడ్డిపల్లి గ్రామాల రైతులతో పాటు జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామ రైతులు కాలుష్య జలాలను వదులుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ‘ప్రజావాణిశ్రీలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కలెక్టర్ విజయేందిరబోయి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, జిల్లా ఇండస్ట్రియల్, వ్యవసాయశాఖ, గ్రౌండ్‌వాటర్ అధికారులను కమిటీ వేసి వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
విస్తృత తనిఖీలు..
దీంతో మంగళవారం జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో పీసీబీ ఈఈ సురేష్, జడ్చర్ల తహసీల్దార్ నర్సింగ్‌రావ్, జిల్లా ఇండస్ట్రీస్ అధికారి ప్రతాప్‌రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటేశ్వర్లు పోలేపల్లి సెజ్‌లోని పరిశ్రమల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. పరిశ్రమల్లో నుంచి వ్యర్థాలను రైతుల వ్యవసాయ పొలాల్లోకి వదిలే రంద్రాలను గమనించి వెంటనే వీటిని మూసివేయాలని ఆయా పరిశ్రమల ప్లాంట్ ఇంచార్జ్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా సంబంధిత అధికారులకు ఎన్నో పర్యాయాలు ఫిర్యాదులు చేస్తున్నా.. వారు పరిశ్రమల నుంచి యథావిధిగా మా పొలాల్లోకి కాలుష్యపు జలాలు వదులుతున్నారని పోలేపల్లి రైతు రఘునందన్‌చారి అధికారులకు గోడు విన్నవించారు. ఓ పరిశ్రమలో అధికారులు తనిఖీలు చేస్తుండగా.. సమాచారం అందుకున్న మిగతా పరిశ్రమల ఇంచార్జ్‌లు అప్రమత్తమయ్యారు. పరిసరాలు శుభ్రంగా చేయడంతోపాటు కాలుష్యం కానరాకుండా చేశారు. ఇదిలాఉండగా, అధికారులు లోపలికి వెళ్లకుండా హెటిరో పరిశ్రమ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో వ్యవసాయశాఖ అధికారులు పరిశ్రమ గేటు బయటే ఉండిపోయారు.
పోలేపల్లి సెజ్ పరిశ్రమల్లో వెలుగుచూసిన నిజాలు
కలెక్టర్ ఆదేశంతో అధికారుల విస్తృత తనిఖీలు
మీ తీరు మారదా.. అంటూ కంపెనీ ఇన్‌చార్జ్‌లపై ఆగ్రహం
తనిఖీల సమాచారం తెలుసుకొని కంపెనీలు అప్రమత్తం
కొన్ని పరిశ్రమల్లో గేట్లు వేసి అధికారులను లోపలికి రానివ్వని వైనం

అదే కాలుష్యం.. అంతే నిర్లక్ష్యం