
మహిళా సంఘాలకు విరివిగా రుణాలివ్వాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మహిళ సాఽధికారితకు స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంకర్ల విరివిగా రుణాలివ్వాలని సెర్ప్ బ్యాంక్ లింకేజీ డైరెక్టర్ వైఎన్ రెడ్డి బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన బ్యాంకర్లు, డీపీఎం, ఏపీఎంలతో సమావేశం నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశానుసారం బ్యాంకర్లు రుణాలివ్వాలన్నారు. రుణాలివ్వకుంటే మహిళా సంఘాల సభ్యులు మైక్రో ఫైనాన్స్‌లను ఆశ్రయిస్తారని దీంతో మరో ప్రమాదం ఉందని తెలిపారు. మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను కచ్చితంగా చెల్లిస్తారని.. వారి నుంచి వందశాతం రుణాలు రికవరీ అవుతాయన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు 2025–26 ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన బ్యాంక్ లింకేజీ రుణ లక్ష్యం రూ.385 కోట్లు పెట్టినట్లు ఈ మొత్తం 9854 మహిళ సంఘాలకు ఇవ్వాలన్నారు. ఈ మొత్తం లక్ష్యం పూర్తి అయ్యేటట్లు బ్యాంకర్లు సహకరించాలన్నారు. తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు వాటిని తిరిగి చెల్లించేలా మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, డీఆర్‌డీఓ నర్సిములు, డీఆర్‌డీఓ ఏపీడీ శారద, డీపీఎం లక్ష్మయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.