
సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
పాలమూరు: సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీజీఎంఎస్‌ఐడీసీ చైర్మన్ ఫణీంద్ర రెడ్డి సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రిని మంగళవారం ఆయన సందర్శించారు. మొదట జనరల్ మెడిసిన్ పురుషుల, మహిళల వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం డైట్ విభాగాన్ని సందర్శించి ఆహార పదార్థాలను, నిల్వ ఉన్న కూరగాయాలు, ఇతర కిరాణ సామాన్ల స్టాక్‌ను తనిఖీ చేశారు. అదేవిధంగా ఎంసీహెచ్ బ్లాక్, సీటీ స్కాన్, పోస్ట్ ఆపరేటీవ్ వార్డు, సెంట్రల్ డ్రగ్‌స్టోర్, ఆస్పత్రిలోని మెయిన్ డ్రగ్ స్టోర్‌ను తనిఖీ చేసి వైద్యాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధలు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో కావాల్సిన మందులను, పడకలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలు నిత్యం శానిటైజేషన్ చేపట్టి పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి, డీఐవో పద్మజా, నారాయణపేట కళాశాల ప్రిన్సిపల్ సంపత్‌కుమార్, డాక్టర్ సునీల్‌కుమార్, అమరావతి, శశికాంత్, భాస్కర్‌నాయక్ పాల్గొన్నారు.