
అటవీ సంపద పెంపునకు సహకరించాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: అటవీ సంపద పెంపునకు సామిల్, టింబర్ డిపోల యాజమానులు సహకారం అందించాలని జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జోగులాంబ జోన్ సామిల్స్, టింబర్ డిపోల యాజమానుల అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కలప అక్రమ రవాణాను ఎవరూ ప్రోత్సహించవద్దని కోరారు. ప్రభుత్వం అడవుల శాతాన్ని పెంచేందుకు అన్ని శాఖల సమన్వయంతో వనమహోత్సవం కార్యక్రమం ద్వారా విరివిగా మొక్కలు నాటనున్నట్లు పేర్కొన్నారు. అటవీ శాఖ అనుమతి లేనిది కలప రవాణా, నిల్వ చేయవద్దని సూచించారు. అనంతరం డీఎఫ్‌ఓ సత్యనారాయణను సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేషన్ నాయకులు రమణయ్య, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, గద్వాల్ నాయకులు నవీన్‌పటేల్, సిద్దిఖ్, శేషుకుమార్, ముస్తఫా, ముఖేశ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.