
ప్రభుత్వ కార్యాలయంలో దొంగలు పడ్డారు
గద్వాల క్రైం: ప్రభుత్వ కార్యాలయంలో గుర్తు తెలియని దుండగులు చొరబడి రెండు కంప్యూటర్లు, రెండు ప్రింటర్లను ఎత్తుకెళ్లిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, కార్యాలయ సిబ్బంది కథనం మేరకు.. గుర్తుతెలియని దుండగులు సోమవారం తెల్లవారుజామున జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్, క్వాలిటీ కంట్రోల్ కార్యాలయం తలుపులు ధ్వంసం చేసి రెండు కంప్యూటర్లు, రెండు ప్రింటర్లను తీసుకెళ్లారు. రోజువారి విధుల్లో భాగంగా డీఈలు కబీర్‌దాస్, సతీష్ కార్యాలయానికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉండడం గమనించి చోరీ జరిగినట్లు గుర్తించారు. సిబ్బంది పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలం వద్దకు పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్ చేరుకుని చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కంప్యూటర్లలో కార్యాలయానికి సంబంధించిన రికార్డులు, బిల్లులు, పలు రకాల ఫైల్స్ హార్డ్ డిస్క్‌ల్లో నిక్షిప్తమై ఉన్నాయని తెలిపారు. అయితే వాటి విలువ రూ.1.50లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఘటనపై డీఈ కబీర్‌దాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కంప్యూటర్లు.. ప్రింటర్లు అపహరణ