
ప్రశాంతంగా జీపీఓ, సర్వేయర్ల పరీక్ష
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామ పాలన అధికారులు (జీపీఓ), లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకం కోసం జిల్లాకేంద్రంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఆదివారం జరిగిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కలెక్టర్ విజయేందిర పరీక్షకేంద్రాన్ని తనిఖీ చేసి.. నిర్వహణ తీరును పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఉదయం జరిగిన గ్రామ పాలన అధికారి పరీక్షకు 100 మంది అభ్యర్థులకు 88 మంది హాజరైనట్లు కలెక్టర్ తెలిపారు. లైసెన్స్‌డ్ సర్వేయర్ల పరీక్షకు సంబంధించి 111 మంది అభ్యర్థులకు 97 మంది హాజరయ్యారని వెల్లడించారు. జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, డిపార్ట్‌మెంటల్ అధికారి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కిషన్ రావు, ఆర్‌డీఓ నవీన్, అర్బన్ తహసీల్దార్ ఘన్షిరాం, తదితరులు పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు.
ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు కృషి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా విద్యాసంస్థలు పనిచేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ధర్మాపూర్ వద్ద జీకే ఇంజనీరింగ్ కళాశాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో కళాశాలలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలసల జిల్లా అని పేరు బడిన పాలమూరు ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా పీయూ అభివృద్ధికి ఒక్క సంవత్సరంలోనే రూ.100 కోట్లు యూజీసీ నిధులు తీసుకొచ్చామని, ఇంజనీరింగ్, లా కళాశాలలను కూడా అనుమతి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు జిల్లా కేంద్రంలో ట్రిపుటీ కళాశాలను కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పాలమూరు బిడ్డ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం వల్లే అనేక అభివృద్ధి పనులు చేసేందుకు సాధ్యపడుతుందన్నారు. పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా, జిల్లాలో వలసలను నివారించాలనే ఉద్దేశంతో ప్రైవేటు కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఆల్ మదీనా విద్యాసంస్థలు కూడా పేద విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, వినోద్‌కుమార్, సిరాజ్‌ఖాద్రీ, బెన్‌హర్, షబ్బీర్, ఇంతియాజ్ ఇసాక్ పాల్గొన్నారు.

ప్రశాంతంగా జీపీఓ, సర్వేయర్ల పరీక్ష