
రైతు బలవన్మరణం
మాగనూర్: సాగునీటి పంచాయితీలో ఓ రైతు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మందిపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ అశోక్‌బాబు కథనం మేరకు.. గ్రామానికి చెందిన కుర్వ సాయిబన్న (48)కు గ్రామ సమీపంలో వ్యవసాయ పొలం ఉంది. సమీప బంధువుల పొలం కింద ఇతడి భూమి ఉండటంతో సాగు నీరు వదలాలని కోరారు. అందుకు వారు నిరాకరించడంతో ఆదివారం గ్రామపెద్దల వద్ద పంచాయితీ పెట్టారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్తాపానికి గురై పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య మల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ వివరించారు.
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
గండేడ్: గడ్డిమందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని చెల్లిల్లలో ఆదివారం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన మోహన్ హైదరాబాద్ నుంచి ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వచీరాగానే గడ్డిమందు తాగాడు. విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు, స్థానికులు 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని బంధువులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియరాలేదు.
క్షణికావేశంలో
గొంతు కోసుకున్న వ్యక్తి
తిమ్మాజిపేట: కుటుంబంలో చిన్నపాటి గొడవ కావడంతో క్షణికావేశంలో గోనెల శేఖర్ గొంతు కోసుకున్న ఘటన ఆదివారం తిమ్మాజిపేట పోలీస్‌స్టేషన్ ఎదుట చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని ఆవంచ గ్రామానికి చెందిన గోనెల శేఖర్ గతంలో జడ్చర్ల సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. కానీ కొన్నిరోజులు ఏం పని చేయకుండా ఊరికే తిరుగుతుండడంతో పాటు తాగుడుకు బానిసయ్యాడు. ఈ విషయమై కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరగడంతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనై తన వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన బాధితుడిని జడ్చర్ల ఆస్పత్రికి తరలించి చికిత్స అనంతరం ఇంటికి పంపించారు. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు
ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి
మిడ్జిల్: ఆగి ఉన్న లారీని ప్రమాదవశాత్తు బైక్ ఢీకొట్టిన ఘటనలో బైక్ మీద ఉన్న వ్యక్తి మృతిచెందాడు. ఈఘటన జడ్చర్ల –కల్వకుర్తి ప్రధాన రహదారిపై మిడ్జిల్ మండలంలోని వాడ్యాల్ గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా.. మిడ్జిల్ మండలంలోని బోయిన్‌పల్లి గ్రామానికి చెందిన గోవిందాచారి (55) ఆదివారం మధ్యాహ్నం పనిమీద జడ్చర్ల బైక్‌పై వెళ్లి.. తిరిగి రాత్రి 8 గంటలకు జడ్చర్ల నుంచి ఇంటికి బయల్దేరాడు. వాడ్యాల్ సమీపంలో జడ్చర్ల కల్వకుర్తి 167 జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మోటార్ సైకిల్‌పై వస్తున్న గోవిందాచారి ఎదురుగా వస్తున్న వాహనాల వెలుతురుకు ముందు ఉన్న వాహనం కన్పించకపోవడంతో లారీ వెనుకవైపు ఢీకొట్టాడు. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతుడి కుటుంబసభ్యులకు విషయం తెలిపి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య మంగమ్మతో పాటుగా ఇద్దరు పిల్లలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.