
చిరు ధాన్యాల సాగు.. బహుళ లాభాలు
అలంపూర్: చిరు ధాన్యాల సాగుతో అధిక లాభాలు గడించే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు సూచించారు. వాటిలో కొర్ర ముఖ్యమైంది. కొర్రలలో పోషకాలతో పాటుగా ఔషద గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో పిండి పరార్థాలు తక్కవ, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా ఊబకాయంతో బాధపడే వారికి మంచి ఆహారంగా గుర్తించారు. వీటిని అన్నానికి బదులుగా తీసుకోవడం ద్వారా చక్కెర వ్యాధి, గుండె జబ్బులు, ఇతర రోగాలను అదుపులో ఉంచుకోవచ్చు. దీంతో కొర్రకు మంచి డిమాండ్ వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో కొర్ర పంట సాగు చేసుకోవడం రైతులకు లాభదాయకమని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియానాయక్ రైతులకు సూచించారు. కొర్ర సాగు, యాజమాన్య పద్ధతులు గురించి తెలుసుకుందాం.
సాగు: కొర్ర పంటను వానాకాలంలో జూన్, జులై నెలల్లో, వేసవి పంటగా జనవరిలోనూ విత్తుకోవచ్చు.
రకాలు: కృష్ణదేవరాయ, నరసింహారాయ, శ్రీలక్ష్మి, ఎస్‌ఐఏ 3085 రకాలు సాగు చేస్తే 80 నుంచి 85 రోజుల్లో కోతకు వస్తాయి. అలాగే ప్రసాద్, సూర్యనంది (ఎస్‌ఐఏ3088) రకాలు 70 నుంచి 75 రోజుల్లో కోతకు రావడంతో పాటు అధిక దిగుబడి ఇస్తాయి.
విత్తన మోతాదు: సాళ్లలో విత్తితే ఎకరాకు రెండు కిలోలు, వెదజల్లే పద్ధతిలో అయితే నాలుగు కిలోల విత్తనం సరిపోతుంది.
● కిలో విత్తనానికి రెండు గ్రాముల కార్బండిజమ్‌తో విత్తన శుద్ధి చేయాలి.
● 25 సెం.మీ ఎడం ఉన్న సాళ్లలో మొక్కల మధ్య 10 సెం.మీ దూరం ఉండేలా విత్తుకోవాలి.
● అంతర్ పంటగా ప్రతి ఐదు సాళ్లకు ఒక సాలు కంది వేయాలి. లేదా 2ః1 నిష్పత్తిలో కొర్ర, వేరుశనగ వేసుకోవచ్చు.
● విత్తిన రెండు వారాల్లోపు ఒత్తు మొలకలు తీసివేయాలి.
● 30 రోజుల వరకు పంట పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూడాలి.
● విత్తిన 20 నుంచి 25 రోజుల తర్వాత సాళ్లల్లో అంతర్ కృషి చేసి కలుపు నివారించాలి.
ఎరువులు: ఆఖరి దుక్కిలో నాలుగు టన్నుల పశువుల ఎరువులను పొలంలో వేసి బాగా కలియదున్నాలి. విత్తేటప్పుడు 20 కేజీల యూరియా, ఒక బస్తా (50 కేజీల) సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయాలి. విత్తిన నెల రోజులకు మరో 20 కేజీల యూరియాను పైపాటుగావేయాలి.
సస్యరక్షణ: కొర్ర పంటను ఆశించే వాటిలో గులాబీ రంగు పురుగు, కాండం తొలిచే పురుగు, చెదలు, మిడతలు, లద్దె పురుగు ముఖ్యమైనవి.
● చెదల నివారణకు చివరి దుక్కిలో ఫాలిడాల్ రెండు శాతం పొడి మందును ఎకరాకు 10 నుంచి 12 కిలోల వంతున మట్టిలో బాగా కలిసేటట్లు వేయాలి.
● మిడతల నివారణకు కార్బరిల్ 5 శాతం పాడి మందును ఎకరాకు 10 నుంచి 12 కిలోల చొప్పున చల్లాలి.
● కిలో విత్తనానికి 3 గ్రాముల కాప్టాన్/థైరామ్, మందుతో విత్తన శుద్ధి చేయడం ద్వారా తుప్పు, అగ్గి, వెర్రికంకి తెగుళ్లను కొంత వరకు ఆరికట్టవచ్చు.
పాడి–పంట

చిరు ధాన్యాల సాగు.. బహుళ లాభాలు