
‘పంటలకు గిట్టుబాటు ధర చెల్లించాలి’
నారాయణపేట: రైతులు సంక్షోభం నుంచి బయటపడాలంటే పంటలకు గిట్టుబాటు ధర చెల్లించాలని ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్ భవన్‌లో నిర్వహించిన అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) నారాయణపేట జిల్లా ప్రథమ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేసి, పంట పెట్టుబడిపై 50 శాతం అదనంగా మద్దతు ధర చెల్లించాలన్నారు. ఏఐయూకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాము మాట్లాడుతూ.. తమ పంటలకు గిట్టుబాటు ధర రాకపోతే దాన్ని నిల్వ చేసుకొనేలా రైతులకు అసరమైన ఏర్పాట్లు చేయాలని కోరారు. దేశంలో దాదాపు 54 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలో నట్టే విధంగా ప్రధాని నరేంద్రమోదీ విధానాలు ఉన్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో ఏఐయూకేఎస్ జిల్లా అధ్యక్షుడు భగవంతు, కార్యదర్శి యాదగిరి, ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి, చెన్నారెడ్డి, కృష్ణయ్య, సహాయ కార్యదర్శులు కొండ నర్సిములు, నారాయణ, బాలకృష్ణ, వ్యవసాయ సంఘం జిల్లా అధ్యక్షుడు సలీం, సీపీఐఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి కాశీనాథ్, టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు నర్సింహ, అరుణోదయ జిల్లా అధ్యక్షుడు రాములు, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి సౌజన్య, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.