
ట్రాఫిక్ సమస్య రాకుండా చూడాలి: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాకేంద్రంలోని ప్రధాన చౌరస్తాల్లో ట్రాఫిక్ సమస్యలు రాకుండా, ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఎస్పీ డి.జానకి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ చౌరస్తా, న్యూటౌన్, షాషాబ్‌గుట్ట చౌరస్తాలో శుక్రవారం ఎస్పీ ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా సౌకర్యవంతమైన రవాణా కల్పించడానికి కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రధానంగా రద్దీ ఉండే సమయాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టాలన్నారు. వాహనదారులు తప్పకుండా నిబంధనలు పాటించే విధంగా చర్యలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ సీఐ భగవంతురెడ్డి పాల్గొన్నారు.
పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం
స్టేషన్ మహబూబ్‌నగర్: 2025–26 విద్యా సంవత్సరానికి మైనార్టీ విద్యార్థులు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శంకరాచారి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదివే మైనార్టీ విద్యార్థులు సెప్టంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈపాస్ వెబ్‌సైట్ ద్వారా http://telanganaepass.cgg. gov.inలో ఆన్‌లైన్‌లో స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 2023–24, 2024–25కి సంబంధించి పెండింగ్ దరఖా స్తులు కళాశాల యాజమాన్యాలు ఈ నెల 31లోగా కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
రెండోరోజు మరో
37 దుకాణాల సీజ్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: స్థానిక మార్కెట్ లైన్‌లోని మున్సిపల్ దుకాణాల నుంచి అద్దెలు సుమారు రూ.2.50 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో శుక్రవారం ఈ ప్రాంతంలోని 37 షాపులను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. మొదటి రోజు గురువారం క్లాక్‌టవర్ సమీపంలోని 35 దుకాణాలపై దాడులు నిర్వహించి తాళాలు వేసిన విషయం విదితమే. ఇప్పటివరకు మొత్తం 72 దుకాణాలను సీజ్ చేశారు. ఈ దాడుల్లో ఆర్‌ఓ మహమ్మద్ ఖాజా, ఆర్‌ఐలు అహ్మద్ షరీఫ్, రమేష్, ముజీబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకేంద్రంలో
మోస్తరు వర్షం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలో శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు మధ్యలో ఓ మోస్తరు వర్షం కురిసింది. వరుసగా నాలుగు రోజుల పాటు పడుతున్న ఈ వర్షాలతో రోడ్లన్నీ చిత్తడి చిత్తడిగా మారాయి. వివిధ చోట్ల ఇసుక మేటలు ఏర్పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆయా వీధులలో డ్రెయినేజీలు నిండి పొంగి పొర్లాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక పది విలీన గ్రామాల్లోని మట్టి రోడ్లు బురదమయంగా మారాయి. నడవడానికి పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రేపు గ్రామ పాలన అధికారుల పరీక్ష
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామ పాలన అధికారుల రెండవ దఫా పరీక్ష ఈ నెల 27న (ఆదివారం) నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయేందిర శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీలో నిర్వహించే పరీక్షకు 99 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. పరిక్షకు హాజరయ్యే అభ్యర్థులు పాస్‌పోర్టు ఫొటోను నిర్ణీత స్థలంలో అతికించాలని, లేకుంటే పరీక్ష రాయడానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అభ్యర్థులు నామినల్ రోల్స్‌లో అతికించడానికి పరీక్ష హాల్‌లో ఒక పాస్‌పోర్ట సైజు ఫొటోను సమర్పించాలని సూచించారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, పేపర్లు, రికార్డింగ్ పరికరాలు పరీక్షకేంద్రం లోపలికి తీసుకొచ్చేందుకు అనుమతి లేదని తెలిపారు.

ట్రాఫిక్ సమస్య రాకుండా చూడాలి: ఎస్పీ