
రైతుల్లో చిగురించిన ఆశలు
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): జిల్లాలో గురువారం మోస్తరు వర్షం కురిసింది. వర్షాలు ఆలస్యం కావడంతో ఆందోళనలో ఉన్న రైతులకు తాజాగా కురుస్తున్న వర్షాలు ఊరట కలిగించాయి. మరో రెండురోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుండటంతో వానాకాలం సాగుపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పత్తి, జొన్న, మొక్కజొన్న తదితర పంటలు, పండ్లు, కూరగాయల తోటలకు ఈ వర్షాలు జీవం పోస్తున్నాయి. ఉదయం నుంచి ముసురు వాన కురిసింది. జిల్లాలో సగటు వర్షపాతం 14.4 మి.మీ., నమోదైంది.
వరినాట్లు షురూ
జిల్లాలో వానాకాలం వరి నాట్లు వేయడం ప్రారంభమైంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో బోరు, బావులు, చెరువుల కింద నార్లు పోసిన రైతులు కూలీలతో వరి నాట్లు వేయిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో సరైన కొంతమంది రైతులు నార్లు పోయకుండా కొద్దిగా మొలకెత్తిన వడ్లను వెదజల్లే పద్ధతిలో సాగు చేస్తున్నారు. జిల్లాలో వానాకాలం సీజన్‌లో సుమారు 2 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు కానుంది. స్వల్పకాలిక, దీర్ఘకాలిక రకాల వరి వంగడాలను నార్లుగా పోసుకున్న రైతులు నాట్లను మొదలుపెట్టారు. వరి సాగు చేసుకునే రైతులు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను ఆఖరి దుక్కిలోనే మొత్తం వేసుకొని కలియదున్ని నాట్లు వేసుకోవాలని, 48 గంటల ముందే జింక్ సల్ఫేట్ వేసుకుని ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి 13,125 ఎకరాల్లో వరి నాట్లు పడగా.. మరో 85,400 ఎకరాల విస్తీర్ణం నర్సరీ దశలో ఉంది. నెల రోజులుగా వర్షాల కోసం ఎదురుచూసిన రైతులకు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ సాగు పనులు ఊపందుకునేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి.
జిల్లాలో రోజంతా కురిసిన ముసురు వాన
పత్తి, మొక్కజొన్న, జొన్న పంటలకు జీవం